చంద్రబాబు గెలిస్తే పథకాలన్నీ కట్

చంద్రబాబు గెలిస్తే పథకాలన్నీ కట్
  • సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

ప్రకాశం, ముద్ర: వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే తాము ప్రవేశ పెట్టిన పథకాలు కట్ చేస్తారని సీఎం జగన్ అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం కొనకమిట్లలో మేమంతా సిద్ధం భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఈ ఎన్నికలు చంద్రబాబు, జగన్ మధ్య జరగుతున్నవి కావని చెప్పారు. ప్రజలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుతున్న ఎన్నికలని తెలిపారు. ప్రజల ఎజెండాతో తాము ఎన్నికలకు వెళ్తున్నామని జగన్ పేర్కొన్నారు. కానీ జెండాలు జతకట్టి వాళ్లు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజల అడుగులు ముందుకా.. వెనక్కా అనే విషయాలపై జరుగుతున్న ఎన్నికలు అని చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం తాము పని చేస్తుంటే రాజకీయాల కోసం ప్రత్యర్థులు పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎప్పుడూ అడ్డదారిలోనే వస్తారని సీఎం జగన్ విమర్శించారు.

చంద్రబాబు ఒక పెద్ద శాడిస్ట్

ఈ సందర్భంగా టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఒక పెద్ద శాడిస్టు అని మండిపడ్డారు. పేద విద్యార్థుల ఉన్నతి కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియా పెడితే ఓర్వలేని శాడిస్టు, ఎస్సీ, ఎస్టీలను కించపరుస్తూ మాట్లాడిన శాడిస్టు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఇచ్చే పింఛన్లను అడ్డుకున్న దుర్మార్గుడు అని మండిపడ్డారు. ఒకరికి మంచి జరుగుతుంటే చంద్రబాబుకు ఓర్చుకునే గుణం ఉండదన్నారు. పేదలకు స్థలాలు ఇవ్వకుండా అడ్డుకున్నారని చెప్పారు. 14 ఏళ్ల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు.. కానీ, ఒక్క పథకం కూడా పేదల అభివృద్ధికి తీసుకురాలేక పోయారని విమర్శించారు. తాము మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని హామీలు నెరవేర్చామని తెలిపారు. పేదలకు సాయం చేసేవాడు కావాలో.. చేస్తుంటే ఓర్వలేక అడ్డుకునేవాడు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని కోరారు. చంద్రబాబుకు ఓటేస్తే రాష్ట్రం అంధకారంలోకి వెళ్లడం ఖాయమన్నారు.

56 నెలల మంచిని అడ్డుకున్నారు..

56 నెలలుగా పింఛన్లు ఇంటి వద్దనే అందించామని.. కానీ చంద్రబాబు అండ్ కో వాటిని అర్ధంతరంగా అడ్డుకున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. వలంటీర్ల వ్యవస్థ చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తించిందన్నారు. అందుకే వలంటీర్లు లేకుండా కుట్ర చేశారని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం అయినా.. సెలవు రోజు అయినా పింఛన్‌ను ఇంటి వద్దనే అందించామని చెప్పారు. నిమ్మగడ్డతో పెన్షన్ల పంపిణీపై ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు చేయించారని ధ్వజమెత్తారు. పింఛన్ దారులను మండే ఎండల్లో నడి రోడ్డుపై నిలబెట్టారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలతో పేదలను ఇబ్బందులకు గురి చేశారని సీఎం జగన్ గుర్తు చేశారు.