ప్రజారోగ్య పరిరక్షణలో ఎయిమ్స సేవలు కీలకం

ప్రజారోగ్య పరిరక్షణలో ఎయిమ్స సేవలు కీలకం

 ఎయిమ్స్ నాలుగో వార్షికోత్సవంలో కలెక్టర్ జెండగే హన్మంత్ కొండిబ
ముద్ర ప్రతినిధి, బీబీనగర్: ప్రజారోగ్య సంరక్షణలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) కీలకమైన పాత్ర పోషిస్తోందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ జెండగే హనుమంత్ కొండిబ అన్నారు. బీబీనగర్ లోని ఎయిమ్స్ నాలుగో వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిమ్స్ పేరుతో వ్యవహరించే ఈ ఆస్పత్రి ఎయిమ్స్ గా రూపొంది దినదినాభివృద్ధి చెందుతోందని వరంగల్ లోని కాళోజి నారాయణరావు హెల్త్ యూనివర్శిటీ ఉప కులపతి డాక్టర్ కరుణాకర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి ఆయన గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ క్యాంపస్ తో నాకు చాలా ఏళ్ల అనుబంధం వుందని తెలిపారు. బీబీ నగర్ నిమ్స్ గా ఈ ఆస్పత్రి ఉండేటప్పుడు, ప్రస్తుతం ఇక్కడ ఆర్థోపెడిక్స్ విభాగాధిపతి డాక్టర్ మహేశ్వర్ ఇక్కడ ఆస్పత్రి ఇన్ఛార్జిగా వున్నపుడు పలుమార్లు తనిఖీలు, ఇతర కార్యక్రమాలకు వచ్చేవాడినని తెలిపారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులంతా చాలా అదృష్టవంతులని, మంచి మేథావులైన ప్రొఫెసర్ల ద్వారా బోధన అందుకుంటున్నారని తెలిపారు. ఎయిమ్స్ను అన్నిరంగాలలో అభివృద్ధి చేస్తున్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ భాటియాను ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు.

ఎయిమ్స్ సేవలపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో నమ్మకంతో వున్నారని ఆయన తెలిపారు. అంతకుముందు ఎయిమ్స్ కార్యనిర్వాహక సంచాలకుడు డాక్టర్ వికాస్ భాటియా మాట్లాడుతూ ఎయిమ్స్ భవనాల నిర్మాణానికి గత ఏడాది ఏప్రిల్ లో 2023 ప్రదాని నరేంద్ర మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేశారని అన్నారు. ప్రస్తుతం 20 బ్లాకులు నిర్మాణంలో వున్నాయని, భారత ప్రభుత్వం ఇందుకోసం 1366 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని వివరించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులకు సంబంధించిన ఒక వీడియోను ప్రదర్శించారు. నాలుగో వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఎయిమ్స్ అధ్యాపకులు, వైద్య విద్యార్థులకు నిర్వహించిన క్రీడా, సాంస్కృతిక పోటీలలో విజేతలకు ముఖ్య అతిథులకు బహుమతి ప్రదానం చేశారు. అలాగే ఈ సందర్భంగా ఎయిమ్స్ బీబీనగర్ కు చెందిన ఇన్విక్టస్ అనే ఒక మాగజైన్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అభిషేక్ అరోరా, డీన్ ఆఫ్ అకడమిక్స్ డాక్టర్ రాహుల్ నారంగ్, డాక్టర్ మృదుల, డాక్టర్ బిపిన్ బి.వర్ఘీస్, తదితర అధ్యాపకులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.