ఛత్తీస్ గఢ్ లో బస్సు బోల్తా... 12 మంది దుర్మరణం

 ఛత్తీస్ గఢ్ లో బస్సు బోల్తా... 12 మంది దుర్మరణం

దుర్గ్ : ఛత్తీస్ గఢ్ లోని దుర్గ్ జిల్లాలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి చెందగా, మరో 14 మంది గాయపడ్డారు. దుర్గ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జితేంద్ర శుక్లా అందించిన వివరాల మేరకు ఒక ప్రైవేట్ డిస్టిలరీకి చెందిన కార్మికులు  పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా కుమ్హారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాప్రి గ్రామ సమీపంలో  మంగళవారం రాత్రి 8.30 గంటలకు ఈ సంఘటన జరిగిందని పిటిఐ వార్తాసంస్థ నివేదించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం 30 మందికి పైగా ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి 40 అడుగుల లోతున్న ‘మురం’ గనిలోకి దూసుకెళ్లిందని తెలిపారు. మురుమ్ అనేది ఒక రకమైన నేల, దీనిని ప్రధానంగా నిర్మాణానికి ఉపయోగిస్తారు. "ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలతో సహా 12 మంది మరణించారు,"  "మొత్తం గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది మరియు ఎయిమ్స్‌కు వారిని తరలించాం," అని విలేకరులకు ఆయన వివరాలు వెల్లడించారు. మట్టి గనిలో బస్సు పడిపోయిందని సమాచారం తెలిసిన వెంటనే పోలీసు బృందం మరియు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం బృందాలు అప్రమత్తమై వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో కలిసి రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభించాయని శుక్లా తెలిపారు. ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించినట్లు దుర్గ్ కలెక్టర్ రిచా ప్రకాష్ చౌదరి తెలిపారు.

"బస్సులో కుమ్హారి ప్రాంతంలో ఉన్న కెడియా డిస్టిలరీస్ కార్మికులు ప్రయాణిస్తున్నారు. ఇప్పటివరకు 12 మంది మరణించినట్టు గుర్తించామని తెలిపారు. గాయపడిన 14 మందిలో 12 మందిని రాయ్ పూర్ లోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు  తరలించారు.  మరో ఇద్దరు స్థానికంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆమె చెప్పారు.

 

చాలా బాధాకరం, తీవ్ర విచారం – ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము సంతాపం

ఛత్తీస్‌గఢ్ బస్సు ప్రమాదంలో 12 మంది మృతికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతా3పం తెలిపారు. ఛత్తీస్ గఢ్ లోని దుర్గ్ లో మట్టిగోతిలో బస్సు బోల్తాపడి 12 మంది మృతి చెందారు. అలాగే మరో 14 మంది ప్రయాణికులు గాయపడ్డారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం తెలిపారు.  ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో జరిగిన బస్సు ప్రమాదం చాలా బాధాకరం.. తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక యంత్రాంగం సహాయక చర్యలలో నిమగ్నమై ఉంది. బాధితులకు అన్ని విధాలా సహాయాన్ని అందజేస్తున్నట్లు ప్రధానమంత్రి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ, "ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో అనేక మంది మరణించారనే వార్త తెలిసి నేను చాలా బాధపడ్డాను. అన్ని మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను."  గాయపడిన వారికి చికిత్స అందించేందుకు తగిన ఏర్పాట్లు చేశామని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి తెలిపారు. బస్సు ప్రమాదంలో ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులు మృతి చెందారనే వార్త అందిందని, మృతుల ఆత్మకు శాంతి కలగాలని, మృతుల కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు సాయి తెలిపారు.