ఉమ్మడి నల్లగొండలో కుదేలైన ఏనుగు

ఉమ్మడి నల్లగొండలో కుదేలైన ఏనుగు

బహుజనవాదం అంటూ బలైపోయిన బిఎస్సీ... ఉమ్మడి నల్లగొండలో గల్లంతైన డిపాజిట్లు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: బహుజనవాదం పేరుతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బహుజన సమాజ్ పార్టీ
ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎన్నికల ఫలితాల్లో బొక్కాబోర్ల పడ్డది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో కనీసం డిపాజిట్లు దక్కించుకోలేక ఉన్న పరువును పోగొట్టుకుంది. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల
ఐక్యత అంటూ, మన ఓటు మనకే అంటూ పోల్ మేనేజ్ మెంట్ లో విఫలమై ఉమ్మడి నల్లగొండలో ఏనుగు కుదైలైపోయింది. ఏకంగా ముఖ్యమంత్రిగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐతడంటు బీరాలు పలికి కనీసం గెలవలేక చేతులెత్తేసింది. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బిఎస్పీ జాతీయ
అధ్యక్షురాలు మాయవతితో బహిరంగ సభలు ఏర్పాటు చేసి భంగపడింది. నూటికి
85 శాతంకు పైగా ఉన్న బహుజనులందరిని తమ ఓటు బ్యాంక్ గా 
మార్చుకోవడంలో ఫెయిలైంది. ఉమ్మడి నల్లగొండలో సూర్యాపేట అసెంబ్లీ
నియోజకవర్గంలో తప్పక గెలుస్తామని ఉత్తర కుమారప్రగల్భాలు పలికిన పార్టీ
కనీసం డిపాజిట్ దక్కించుకోలేదంటే పలువురు విస్తుపోతున్నారు. ఆరంభ శూరత్వం
తప్పించి ఆచరణ లేకపోవడంతో పార్టీ ఒక్కసారిగా ఆకాశమార్గాన పయనిస్తుందని
భ్రమలుపడుతూ నేల విడిచి సాము చేసిన ఆ పార్టీ నాయకత్వాన్ని చూసి ప్రజలు
ఔరా అంటూ ముక్కువ వేలేసుకుంటున్నారు. బీరకాయ, సొరకాయ కోతలు
తప్పించి ప్రజలు పెట్టబోయే వాతలను గమనించలేకపోయారు.

చీఫ్ ట్రిక్ లతో, గొడ్డలి డ్రామాలు, ఆసుపత్రి సీన్లు రక్తికట్టలేదు. అధికారపార్టీని ఇరుకున పెట్టాలని చేసిన ప్రతి
ప్రయత్నం బెడిసికొట్టింది, చివరకు తాను తీసుకున్న గొయ్యిలో తానే పడ్డట్టు
అయ్యింది. బహుజనవాదం అంటూ పేరుచెప్పుకుని అగ్రకుల వ్యక్తి చేతిలో షార్టీ
పగ్గాలు పెట్టి నడిపించిన తీరుపట్ల పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రత్యర్ధులను చీల్చిచెండాతుందని నమ్మిన అశోకచక్రం చివరకు వారి తలలనే
చిద్రం చేసిందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఆర్ధిక అధికారాలన్నీ ఒకే వ్యక్తి
వద్ద పెట్టుకుని ముఖ్యనాయకులు, కార్యకర్తలను నిర్లక్ష్యం చేశారనే భావన బిఎస్పీ
శ్రేణుల్లో నాటుకోవడమే కాదు పలువురు బహిరంగంగా ఆరోపణలు చేశారు. తాను
చేసిన తప్పులకు, చట్టం నుంచి, పోలీసు కేసులనుంచి తప్పించుకోవడానికే
బహుజనవాదం జెండా, ఎజెండా ఎత్తుకున్నారని, చైతన్యవంతులైన సూర్యాపేట
అంచనావేసి తగిన గుణపాఠం ప్రజలు ఎవరిని ఎలా ఏ సమయంలో నేర్పాలో అలానే ప్రవర్తించారని, ప్రజలను తక్కువ అంచనా వేసి ఓటర్లు అందరూ
గొర్రెలే అనేలా చులకనబావంతో జమకట్టడంతో కర్రుకాల్చి వాత ఎక్కడ పెట్టాలో
అక్కడే పెట్టారనే వాదనలున్నాయి. చివరకు ఇతర పార్టీల నుంచి బి ఎస్పీలోకి
వచ్చిన వారు ఇక్కడ సదరు నాయకుడి, నడిపించేవారి వైఖరితో ఇమడలేక,
పొసగలేక బయటకు వెళ్ళారని, తెల్లారి ఎన్నికలు అనగా అర్దరాత్రి పార్టీ
కార్యాలయం వద్ద పార్టీలో మొదటి నుంచి వచ్చిన ఒక కౌన్సిలర్ భర్త అసభ్య
పదజాలంతో విరుచుకుపడిన సంఘటనలు, వార్డులలో డబ్బుల పంపిణీ
విషయంలో చివరకు చేతులెత్తేసిన సంఘటనలు, కనీసం మీడియా వ్యక్తులకు
ఇగో, అగో అంటూ చివరి వరకు సాగదీసి మోచేతికి బెల్లంపెట్టి మోకాలికి
నాకించినమాదిరి ప్రవర్తించిన సందర్భాలు, పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు
చివరిదాకా వేచిచూసి నిర్లక్ష్యదోరణితో ప్రవర్తిస్తున్న నాయకత్వాని చూసి నిరాశ,
నిస్పృహలతో వెనుదిరిగిన వైనాలు, ఎంతో పరువు, ప్రతిష్ట, మంచి చరిత్ర,
సదాశయంతో ఉన్నత బావనలతో ఏర్పాటు చేసిన ఒక జాతీయపార్టీ చివరకు
ఆర్ధికనేరస్తులకు, మోసగాళ్ళకు, ప్రజలను వంచనకు గురిచేసినవారికి,
భూఅక్రమణదారులకు, కబ్జారాయుళ్ళకు అసెంబ్లీ టికెట్లు ఇచ్చి ఓటర్లు అంటే
ఎర్రిగొర్రెలే అనేలా చాలా చీప్ గా జమకట్టి గెలిపించండి అంటే
వివేకవంతులైన,విజ్ఞానపరులైన, చైతన్యవంతులైన, నిజాయితీపరులైన సూర్యాపేట
ఓటర్లు ఎలా నమ్ముతారని, ప్రజలను ఒక అజ్ఞానులుగా అంచనావేసి డబ్బులు
ఇస్తే చాలు గెలిపిస్తారు అనే ఒక పిచ్చి భ్రమలో సదరు పార్టీ నాయకులు
వ్యవహరించిన తీరును సూర్యాపేట ప్రజలు చీత్కరించి సమర్ధవంతంగా
తిప్పికొట్టారు. సాయుధపోరాటానికి, చైతన్యానికి ఆలవాలమైన సూర్యాపేట గడ్డ
ఒక జుగుప్సాకరమైన రీతిలో ప్రజలను తక్కువ అంచనా వేసి తాము ఏమి
చేసినా చెల్లుబాటు అవుతుందనే రీతిలో పట్టుమని కనీసం గ్రామశాఖలు,
వార్డుశాఖలు, సర్పంచ్లు, ఎంపిటిసిలు, జడ్పిటిసిలు, ఇతర వార్డులు, పల్లెల్లో
పట్టు లేకుండానే గెలుస్తామనే ఓవర్ కాన్ఫిడెన్స్ను ఓట్ల ద్వారా పటాపంచలు
చేశారు. పార్టీ అభ్యర్ధి వ్యక్తిగత పంచాయితీలను, తగాదాలను పార్టీ విధానాలకు
పూయడం, పార్టీని అండగా చూపి పదవి సంపాయించాలని చూడడం, చివరకు
బెడిసి కొట్టడంతో కనీసం ప్రజలకు ముఖం చూపించేదశలో పార్టీ నాయకులు
లేరంటే ఆశ్చర్యం వేయకమానదు. ఎంతసేపు, ఏనాడు కూడా పార్టీ గెలుస్తుంది.
అనే సందేశం నాయకులు, కార్యకర్తలకు ఇవ్వకుండా ఎన్ని ఓట్లు చీలుస్తాము,
అధికారపార్టీ గెలుపుకు గండి ఎలా కొట్టాలి అనే దిశగానే పార్టీని నడిపారనే
వాదనలున్నాయి. పార్టీ గెలుపుకు అవసరమైన ఆర్థిక వనరులు కూడా
సమకూర్చుకోలేకపోవడం, అందుకు అధికారపార్టీని నిందించడం, ఒక దశలో
ఇతర పార్టీకి సన్నిహితంగా మెలిగినట్లు సంకేతాలు రావడం, నాయకులు బయటకు
చెప్పుకోలేకపోయినా మనసులో మాత్రం జరుగుతున్న పరిణామాలపట్ల ఒక
లావా విరజిమ్మేలా భగ్గుమనడం, మౌనంగానే ఉన్నా ఓట్లు రాబట్టడంతో మొత్తం
పార్టీ యంత్రాంగం అంతా అనుకున్న మేర రాణించలేకపోవడం ఇలా ఉమ్మడి
నల్లగొండ జిల్లాలో బి ఎస్పీ కనీసం డిపాజిట్లు దక్కించుకోకపోవడంపై ముఖ్య
నాయకులు, కార్యకర్తలు పెదవి విప్పలేక కినుకవహించారని, రానున్న లోక్ సభ
ఎన్నికల వరకైనా పార్టీ పుంజుకునేలా చేయాలని, ఒక రకమైన నిశ్శబ్ద
మౌనరోదనతో పార్టీ శ్రేణులున్నాయని రాజకీయ వర్గాల బోగట్టా.