మీడియా అకాడమీ చైర్మన్ కు అభినందనల వెల్లువ

మీడియా అకాడమీ చైర్మన్ కు అభినందనల వెల్లువ

 ముద్ర ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా టియుడబ్ల్యూజే (ఐ జేయు) జాతీయ అధ్యక్షులు, సీనియర్ సంపాదకుడు కే శ్రీనివాసరెడ్డిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిస్టుల హక్కులు సంక్షేమం కోసం దశాబ్దాల పాటు పోరాటం చేసిన వ్యక్తికి మీడియా అకాడమీ చైర్మన్ పదవి ఇవ్వడంతో  సంపూర్ణ న్యాయం జరుగుతుందని జర్నలిస్టు సమాజం విశ్వాసం వ్యక్తం చేస్తుంది. 1996లో ప్రెస్ అకాడమీ ఏర్పడగా  మొదటి చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన ఆయన మరో మారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రభుత్వంలో మీడియా అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉత్తర్వులు వెలువడే సమయానికి శ్రీనివాసరెడ్డి కరీంనగర్ ఉన్నారు.

విషయం తెలిసిన వెంటనే టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ పుష్పగుచ్చం అందించి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా నగునూరి శేఖర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై సంపూర్ణ అవగాహన కలిగిన వ్యక్తికి మీడియా అకాడమీ చైర్మన్ రావడం శుభ సూచికం అన్నారు. కె శ్రీనివాస రెడ్డి హయాంలో సంపూర్ణ న్యాయం జరుగుతుందని తెలంగాణ జర్నలిస్టులు పూర్తి విశ్వాసంతో ఉన్నట్లు పేర్కొన్నారు.

తెలంగాణ ఆవిర్భావం అనంతరం జర్నలిస్టుల స్థితిగతులు మారతాయని ఆకాంక్షించిన జర్నలిస్టులకు అనుకున్న మేర న్యాయం జరగలేదన్నారు. టియుడబ్ల్యూజే ( ఐజేయు ) జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎలగందుల రవీందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈద మధుకర్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బల్మూరి విజయసింహారావు, గాండ్ల శ్రీనివాస్, ఉమ్మడి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్,ప్రధాన  కార్యదర్శి ఊరడి రవీందర్, సీనియర్ జర్నలిస్టులు ఒంటెల కృష్ణ, దాడి సంపత్ తో పాటు పలువురు సీనియర్ జర్నలిస్టులు వివిధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, చైర్మన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.