రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్‌గా శ్రీనివాస్ రెడ్డి

రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్‌గా శ్రీనివాస్ రెడ్డి
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ముద్ర, తెలంగాణ బ్యూరో: ప్రముఖ జర్నలిస్టు, ప్రజాపక్షం సంపాదకులు కే. శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఆదివారంనాడు జీవో జారీ చేసింది. ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారని జీవోలో పేర్కొన్నారు.  శ్రీనివాస్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ తొలి చైర్మన్ గా పని చేశారు. మూడు  దశాబ్దాల అనంతరం ఆయన మళ్లీ ఈ పదవిలో నియమితులయ్యారు. దేశంలో జర్నలిస్టు ఉద్యమంలో కీలక పాత్ర వహిస్తున్న శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షులుగా ఉన్నారు. 
ఆయన నేపథ్యం.....
నల్లగొండ జిల్లాలోని ఒక మారుమూల గ్రామమైన పల్లెపహాడ్ 1949 సెప్టెంబరు 7వ తేదీన  జన్మించారు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న చరిత్రగల రైతు కుటుంబం శ్రీనివాస్ రెడ్డిది. క్రమక్రమంగా జర్నలిస్టులకు వృత్తిపరంగా ఉన్న ఉద్యోగ సంఘ ఉద్యమంలో అగ్రశ్రేణి నాయకుడిగా ఎదిగారు. గ్రాడ్యుయేషన్ పూర్తికాగానే, 21 ఏళ్ళ చిన్న వయసులో ప్రముఖ దినపత్రిక ‘విశాలాంధ్ర’లో స్టాఫ్ రిపోర్టర్ ఆయన జర్నలిజం ప్రస్థానాన్ని ప్రారంభించారు. జర్నలిజం వృత్తిలో కీర్తిప్రతిష్ఠలు సంపాందిస్తూ సుదీర్ఘకాలంగా చేస్తున్న సేవలకుగాను అదే పత్రికలో సంపాదకుడి స్థాయికి ఎదిగారు. కొంతకాలం ‘మన తెలంగాణ’ దినపత్రికకు కూడా సంపాదకుడుగా సేవలు అందించారు. హైదరాబాద్ కేంద్రంగా వెలువడుతున్న ‘ప్రజాపక్షం’ దినపత్రికలో ప్రస్తుతం ఆయన సంపాదకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత ఐదు దశాబ్దాలుపైగా తెలుగు పత్రికారంగంలో ఆయన ఆవిశ్రాంత కృషి చేస్తున్నారు. జర్నలిజం పట్ల తనకు ఉన్న నిబద్ధత, చిత్తశుద్ధి, వృత్తిపరంగా ఉన్న లోతైన పరిపూర్ణ అవగాహన, నైతిక విలువల కారణంగా పత్రికారంగంలో శ్రీనివాసరెడ్డి ఎనలేని కీర్తిప్రతిష్టలు సంపాదించుకున్నారు. విద్యార్థి దశలో ఆయన హైదరాబాద్ విద్యార్థుల సంఘం (హెచ్ ఎంతో క్రియాశీల పాత్ర పోషించారు.

ఆ తర్వాత అఖిలభారత విద్యార్థి సమాఖ్య ఎఐఎస్ఎఫ్  నాయకుడుగా పనిచేశారు. పత్రికారంగంలో ప్రవేశించగానే ప్రవృత్తిరీత్యా తనలో నిబిడీకృతమై ఉన్న సంస్థాగతమైన ఉద్యమ నాయకత్వ లక్షణాలు ఆయనను సహజంగానే దేశంలో జర్నలిస్టులకు ఉన్న అతిపెద్ద సంఘం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఎపియుడబ్లుజె)లో క్రియాశీల బాధ్యతలు చేపట్టేలా ముందుకు నడిపించాయి. క్రమంగా జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగిన ఆయన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజెయు) అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నారు. ఏపియుడబ్లుజె ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జర్నలిస్టుల హక్కుల సంరక్షణకోసం అనేక పోరాటాలు చేశారు. గృహ నిర్మాణాలు సహా వారి సంక్షేమంకోసం సంఘం ద్వారా సేవలు అందించారు. పత్రికారంగంలో చేస్తున్న అవిశ్రాంత కృషి ఫలితంగా ఆయన జాతీయస్థాయి నాయకుడిగా ఎదిగారు. గతంలో రెండు దశాబ్దాలపాటు ఐజెయు జాతీయ ప్రధాన కార్యదర్శిగా, జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఇటీవల జాతీయస్థాయిలో జరుగుతున్న పరిణామాల కారణంగా ఆయన తిరిగి ఐజెయు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించక తప్పలేదు. పత్రికా స్వాతంత్య్రంకోసం, భావ ప్రకటనా స్వేచ్ఛకోసం, జర్నలిస్టుల పని పరిస్థితులు, వారి జీవన స్థితిగతులు మెరుగుపరచడంకోసం జాతీయస్థాయిలో అనేక పోరాటాలు చేసిన ప్రముఖ నాయకుడు శ్రీనివాసరెడ్డి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (విశ్రాంత) నాయకత్వాన ఉండే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పిసిఐ)కు ఆయన సేవలు అందించారు. రెండు విడతలుగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యుడుగా, సెంట్రల్ ప్రెస్ అక్రెడిటేషన్ కమిటీ (సిపిఎసి)లలో ఐజెయు తరపున సభ్యుడుగా ఆయన ప్రాతినిధ్యం వహించారు. 
ఏ పీ ప్రెస్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడుగా...
ఆంధప్రదేశ్ ప్రెస్ అకాడమీ (కేబినెట్ హోదా) వ్యవస్థాపక ఛైర్మన్ గా శ్రీనివాసరెడ్డి పనిచేశారు. పత్రికారంగ ప్రమాణాలను మరింతగా అభివృద్ధి చేయడానికి, జర్నలిజం వృత్తి ప్రమాణాలు పెంచి పాత్రికేయులకు శిక్షణా కార్యక్రమాలు కొనసాగించడం కోసం ఆయన కృషి, ఎపియుడబ్లుజే ప్రోత్సాహం కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఆవిర్భవించింది. ‘పెయిడ్ న్యూస్’ చీడపై ప్రెస్ కౌన్సిల్ సభ్యుడుగా ఉన్న సమయంలో శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఒక కమిటీ సమర్పించిన నివేదికకు పార్లమెంటు సహా ఇతర రంగాల నుండీ సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

ఐతే వాస్తవానికి ‘పెయిడ్ న్యూస్’ అనే పదం సృష్టికర్త శ్రీనివాస్ రెడ్డే. వృత్తిపరమైన బాధ్యతలలో భాగంగా, సంఘ కార్యకలాపాల రీత్యా కూడా అమెరికా సహా రష్యా, చైనా, క్యూబా వంటి అనేక దేశాలలో ఆయన పర్యటించారు. నాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సహా ఇద్దరు ప్రధానమంత్రులు అధికారికంగా జరిపిన విదేశీ పర్యటనలలో వృత్తిరీత్యా వారి వెంట పాల్గొన్నారు.   రాజకీయ విశ్లేషకుడుగా ఆయన దాదాపు అన్ని టీవీ ఛానళ్ళలోనూ చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. తెలంగాణ, ఆంధప్రదేశ్ తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందిన పాత్రికేయులలో ఒకరుగా శ్రీనివాసరెడ్డి కీర్తిప్రతిష్టలు పొందారు. జర్నలిజంలో వృత్తిప్రమాణాలు సాధించాలన్న నిర్దేశిత లక్ష్యం కోసం శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ కేంద్రంగా మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్, ఇండియా (మెఫి)ని  స్థాపించి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి ముందుకు నడిపించారు.
 శ్రీనివాస్ రెడ్డికి యూనియన్ నేతల అభినందనలు 

మీడియా అకాడమీ చైర్మన్ గా నియమితులైన శ్రీనివాస్ రెడ్డికి ఐ జేయూ, టీ యూడబ్ల్యూజే, ఏపీయూడబ్ల్యూజే నాయకులు అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ఐ జే యూ స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎస్ ఎన్ సిన్హా, ఎం ఏ మాజిద్, ఐ జే యూ సెక్రెటరీ జనరల్ బల్విందర్ సింగ్ జమ్మూ,

కార్యదర్శులు వై. నరేందర్ రెడ్డి, డి. సోమసుందర్,  కార్యవర్గ సభ్యులు కే సత్యనారాయణ, ఆలపాటి సురేశ్ కుమార్, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి కె విరాహత్ అలీ, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, యూనియన్ సీనియర్ నాయకులు డి కృష్ణారెడ్డి ఉన్నారు.