హైదరాబాద్ శారదా  పీఠం ఆధ్వర్యంలో రాజశ్యామలా అమ్మవారి ఆలయం

హైదరాబాద్  శారదా  పీఠం ఆధ్వర్యంలో రాజశ్యామలా అమ్మవారి ఆలయం

* సనాతన సాంప్రదాయ పద్ధతిలో గర్భన్యాసం కార్యక్రమం నిర్వహించిన పీఠాధిపతులు
* దేవాలయాలు శక్తివంతంగా ఉండడానికి గర్భన్యాసం ఎంతో ముఖ్యం
* ఆలయ ప్రాంగణంలో జగద్గురు సన్నిధి ప్రారంభోత్సవం 
* కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ హై కోర్టు న్యాయమూర్తి నామవరపు రాజేశ్వర రావు, NCLT న్యాయమూర్తి బద్రీ నాథ్ 
* భక్తులకు అనుగ్రహ భాషణం, ఆశీర్వచనాలు అందజేసిన పీఠాధిపతులు


విశాఖ శ్రీ శారదా పీఠం ఆధ్వర్యంలో కోకాపేటలో అంగరంగ వైభవంగా నిర్మిస్తున్న శ్రీ శారదా స్వరూప రాజ శ్యామలా అమ్మవారి ఆలయంలో గర్భన్యాసం (పేళా స్థాపన) కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ నిర్మాణానికి అతి ముఖ్యమైన ఈ ప్రక్రియ సనాతన సాంప్రదాయ పద్ధతిలో విశాఖ శారదా పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి వారు, ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వారు  వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన జగద్గురు సన్నిధిని ప్రారంభించారు. వాస్తు హోమాలు , పూర్ణాహుతి , గో పూజ చేసిన అనంతరం మహాస్వామి వారు ఉత్తరాధికారితో కలసి భక్త జనుల సమక్షంలో నూతన ఆశ్రమ ప్రవేశం చేశారు. సమస్త జనుల సంక్షేమం ఆకాంక్షిస్తూ నూతన ఆశ్రమంలో శ్రీ శారదా స్వరూప చంద్రమౌళీశ్వర స్వామివారి ఆరాధన చేశారు. అధిక సంఖ్యలో  తరలి వచ్చిన భక్తులు ఈ పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం  తమ అదృష్టం అని ఆనందం వ్యక్తం చేశారు. తరలివచ్చిన అశేష భక్తజనులకు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి వారు అనుగ్రహ భాషణం చేసారు. ఈ పేళాస్థాపన కార్యక్రమం ఆగమ శాస్త్రంలోనూ, శిల్ప శాస్త్రంలోనూ విశిష్ఠత కలిగి ఉన్నదని అన్నారు. పూర్వీకులు నిర్మించిన దేవాలయములు శక్తి వంతంగా, దేదీప్యమానంగా వెలుగొందడానికి  కారణం దైవశక్తి తో బాటు ఈ పేళాస్థాపన ప్రక్రియ కూడా మూల కారణమని స్వామి వారు తెలిపారు. ప్రస్తుత కాలంలో ఈ గర్భన్యాసం కనుమరుగు అవుతున్నప్పటికీ, ఈ ఆలయ నిర్మాణంలో శాస్త్రోక్తంగా గర్భన్యాసం నిర్వహించడం జరిగిందని తెలిపారు. త్వరలోనే ఈ ఆలయ నిర్మాణం పూర్తి అయి, తెలంగాణా రాష్ట్రానికే తలమానికంగా మారి ఒక దివ్య క్షేత్రంగా  వెలుగొందగలదని, అమ్మవారి అనుగ్రహం అందరికీ కలుగుతుందని  మహాస్వామి వారు అన్నారు. తెలంగాణ హై కోర్టు న్యాయమూర్తి నామవరపు రాజేశ్వర రావు, NCLT న్యాయమూర్తి బద్రీ నాథ్ ఈ మహోన్నత కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఉత్తరాధికారి శ్రీ స్వాత్త్మానందేంద్ర సరస్వతీ స్వామి వారి ప్రత్యక్ష  పర్యవేక్షణలో కార్యక్రమం ఆద్యంతం ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది.