ఓర్వ లేకనే 111 జీ వోపై రేవంత్ వ్యతిరేక వ్యాఖ్యలు

ఓర్వ లేకనే 111 జీ వోపై రేవంత్ వ్యతిరేక వ్యాఖ్యలు
ముద్ర, తెలంగాణ బ్యూరో: పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకట్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 111 జీవో ఎత్తివేత కోసం 84 గ్రామాల ప్రజలు  మూడు దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్నారన్నారు. వారి న్యాయమైన పోరాటానికి సిఎం కేసీఆర్ స్పందించి.. ఆ జీవోను ఎత్తివేశారన్నారు. దీనికి సంతోషించాల్సిన రేవంత్ రెడ్డి అనవసర రాజకీయాలు చేస్తూ కేసీఆర్ పై తప్పుడు ఆరోపణలు చేస్తుండడం సిగ్గుచేటని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో విమర్శించారు.
111 జీవో  బాధిత  గ్రామాల పంచాయతీలు, మున్సిపాలిటీలు జీవో ఎత్తివేయాలని కోరుతూ చేసిన తీర్మానాలపై  ఆనాడు(2009 లో) ప్రతిపక్ష పార్టీ నేతగా కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడిగా ఇచ్చిన మాట ఇచ్చారని  ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఇచ్చిన హామీకి కట్టుబడి 111 జీవోను తొలగించారన్నారు. జీవో పీడ విరగడ కావడంతో ఈ ప్రాంత ప్రజలు సంబరాలు చేసుకుంటుంటే.. ఓర్వలేనితనంతో రేవంత్ రెడ్డి  ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  కేసీఆర్ చేస్తున్న మంచి పనులతో కాంగ్రెస్ కు పుట్టగతులు ఉండవనే ఆందోళనతోనే  రేవంత్  తప్పుడు కూతలు కూస్తున్నారని విమర్శించారు.