పర్యాటకశాఖ ముఖ్యకార్యదర్శికి హైకోర్టు హెచ్చరిక

పర్యాటకశాఖ ముఖ్యకార్యదర్శికి హైకోర్టు హెచ్చరిక

హైదరాబాద్‌లో చారిత్రక కట్టడంగా గుర్తింపు పొందిన హిల్‌ ఫోర్ట్‌ ప్యాలెస్‌ పునరుద్ధరణ విషయంలో అధికారులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  హిల్‌ఫోర్ట్‌ భవన నిర్మాణాలను పరీక్షించి, అధ్యయన నివేదికను ఇవ్వాలన్న తమ ఆదేశాలు అమలు చేయకపోవడంపై చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ తుకారాంజీ ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆదేశాలు అమలు చేయకపోవడాన్ని కోర్టు ధిక్కరణ నేరంగా పరిగణించి ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టులో నిలబెడతామని పర్యాటకశాఖ ముఖ్యకార్యదర్శికి హెచ్చరిక జారీచేసింది.

'హిల్‌ఫోర్ట్‌ ప్రజల ఆస్తి.. చారిత్రక సంపద.. దానిని పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత. జనవరి 10 ఆదేశాలు జారీచేస్తే ఇప్పటివరకు అమలు కాలేదు. మార్చి 15న శాంపిల్స్‌ సేకరించారు. శాంపిల్స్‌ సేకరించడానికే అంత సమయం పడితే నివేదిక ఎప్పుడిస్తారు. గతంలో హాజరైన అధికారులందరూ ప్రత్యక్షంగా హాజరుకావాలని మళ్లీ పిలుస్తాం' అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వచ్చే విచారణ తేదీనాటికి నివేదిక సమర్పించకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని పేర్కొంది. పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శిని ఉదయం నుంచి కోర్టు విధులు ముగిసే వరకు కోర్టులో నిలబడి ఉండాల్సి వస్తుందని తెలిపింది.తదుపరి విచారణను ఏప్రిల్‌ 20కి వాయిదా వేసింది.  హిల్‌ఫోర్ట్‌ను పునరుద్ధరించాలని.. లేదా తమకు అప్పగిస్తే పునరుద్ధరణ పనులు చేపడతామని హైదరాబాద్‌ హెరిటేజ్‌ ట్రస్ట్‌ 2020లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ నేపథ్యంలో హైకోర్టు ఒత్తిడి మేరకు హిల్‌ఫోర్ట్‌ భవన నిర్మాణాన్ని అధ్యయనం చేయడానికి నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిపుణుల కమిటీని వేసింది. మార్చి 15న శాంపిల్స్‌ సేకరించామని ప్రభుత్వం హైకోర్టుకు వెల్లడించింది. మరో మూడు వారాలు సమయం ఇవ్వాలని కోరడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.