అంతర్జాతీయ క్రీడా పోటీల్లో సత్తా చాటిన టిఎస్‌ ఆర్టీసీ ఉద్యోగులు

అంతర్జాతీయ క్రీడా పోటీల్లో సత్తా చాటిన టిఎస్‌ ఆర్టీసీ ఉద్యోగులు
  • ఇంటర్నేషనల్‌ ఆసియా-పసిఫిక్‌ మాస్టర్స్‌ గేమ్స్‌లో రెండు పతకాలు
  • ఉద్యోగులను అభినందించిన సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌

ముద్ర, ముషీరాబాద్: సౌత్‌ కొరియాలో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్‌ ఆసియా-పసిఫిక్‌ మాస్టర్స్‌ గేమ్స్‌లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులు ఆర్చరీలో రెండు పతకాలను సాధించారు. జీడిమెట్ల డిపో కండక్టర్ ఎం.అంజలి ఆర్చరీ 18 మీటర్ల విభాగంలో గోల్డ్ మెడల్ గెలుపొందగా కరీంనగర్ జోనల్ వర్క్ షాప్  మెకానిక్ కె.కిషన్ 30 మీటర్ల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించారు. హైదరాబాద్ లో ఫిబ్రవరిలో జరిగిన ఆలిండియా మాస్టర్స్‌ గేమ్స్‌ లో వీరు సత్తా చాటడంతో ఇంటర్నేషనల్‌ ఆసియా- పసిఫిక్‌ మాస్టర్స్‌ గేమ్స్‌కు ఎంపికయ్యారు. సౌత్ కొరియాలోని జియోన్‌బుక్ లో ఈ నెల 12 నుంచి 20 వరకు ఈ పోటీలు జరిగాయి. వీరిద్దరి ప్రతిభను గుర్తించిన సంస్థ సౌత్ కొరియాకు వారిని పంపించడంతో రెండు పతకాలు సాధించారు. ఇంటర్నేషనల్‌ ఆసియా-పసిఫిక్‌ మాస్టర్స్‌ గేమ్స్‌లో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు సత్తా చాటి 2 పతకాలు సాధించడంపై సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ హర్షం వ్యక్తం చేశారు. పతకాలు సాధించిన ఎం.అంజలి, కె.కిషన్‌ లను హైదరాబాద్ లోని బస్ భవన్ లో మంగళవారం ఆయన అభినందించారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ...
అంతర్జాతీయ క్రీడల్లో  రాణించి రెండు పతకాలు సాధించడం సంస్థకు ఎంతో గర్వకారణమన్నారు. అంతర్జాతీయ, జాతీయ క్రీడల్లో పాల్గొనే ఉద్యోగులకు టీఎస్ఆర్టీసీ అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని చెప్పారు. భవిష్యత్ లో జరిగే పోటీల్లోనూ పాల్గొని సంస్థకు మంచి పేరు తీసుకురావాలని వారికి సూచించారు. నిరంతర కృషి, ప్రాక్టిస్‌తోనే క్రీడల్లో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని అన్నారు. తమను సౌత్ కొరియా పంపించి ప్రోత్సహించిన సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ కు ఈ సందర్భంగా ఎం.అంజలి, కె.కిషన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ యాదగిరి, సీపీఎం కృష్ణకాంత్‌, ఫిజియో హిమన్షు కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.