పని చేయించుకున్నారు కానీ పైసలు ఇవ్వడం మరిచారు - ఇది భూపాలపల్లి ఎన్నికల అధికారు తీరు

పని చేయించుకున్నారు కానీ పైసలు ఇవ్వడం మరిచారు - ఇది భూపాలపల్లి ఎన్నికల అధికారు తీరు

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:-జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎన్నికల అధికారుల తీరే వేరుగా ఉంది. ఎన్నికల నిర్వహణలో భాగంగా కొంతమందికి బాధ్యతలు అప్పగించి పనిచేయించుకున్నారు. ఆ తర్వాత వారికి పైసలు ఇవ్వకుండా ముఖం చాటేశారు. దీంతో బాధితులు అసంతృప్తికి లోనవుతున్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు గాను ఆయా గ్రామాలకు చెందిన వివోఏ లకు విధులు నిర్వహించాలని బాధ్యతలు అప్పగించారు. కాగా ఎన్నికల అధికారుల ఆదేశానుసారం వివోఏ లు తమకు అప్పగించిన ఎన్నికల విధులను నిర్వహించారు. పనిచేసిన వివోఏ లకు మాత్రం అధికారులు పైసలు ఇవ్వలేదు.

విధులు నిర్వహించిన బాధితులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. కనీసం గ్రామాల చార్జీలు భరించుకుని అటు జిల్లాకేంద్రానికి వెళ్లి, తిరిగి గ్రామాలకు వచ్చి ఎన్నికలు పూర్తయ్యేవరకు విధులు నిర్వహించగా జిల్లా స్థాయి ఎన్నికల అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. అధికారులను నిలదీసే ధైర్యం లేక పనిచేసిన డబ్బులు అడగలేక బాధితులు గమ్మున ఉండి ఉండిపోయారు. ఈ విషయంపై సంబంధిత ఎన్నికల అధికారులు ఏమి తెలియదు అన్నట్లు వ్యవహరించడంపై నియోజకవర్గంలో విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. నియోజకవర్గంలోని సుమారు వందమందితో పనులు చేయించుకుని, పైసలివ్వకపోవడం పట్ల అసలు మతలబు ఏమిటోనని ఈ ప్రాంతంలో చర్చలు జోరుగా సాగుతున్నాయి.