బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులకు మెరుగైన విద్య..

బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులకు మెరుగైన విద్య..
  • ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులకు మెరుగైన ఉన్నత విద్యను అందిస్తుందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు మారుమూల గ్రామంగా ఉన్న భూపాలపల్లి శరవేగంగా దినదినాభివృద్ది చెందుతూ జిల్లాగా ఏర్పడి, ప్రస్తుతం జిల్లా వైద్య సేవలకు నిలయంగా మారిందన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో వంద పడకల ఏరియా హాస్పిటల్ తో పాటు, మెడికల్ కాలేజ్, ఆయుష్ హాస్పిటల్ రావడం మెడికల్ హబ్ గా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. భూపాలపల్లి మెడికల్ కళాశాల ఏర్పాటుతో విద్యార్ధులకు వైద్య విద్యలో సీట్ల సంఖ్య పెరిగిందని, విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రతి ఒక్కరూ ఇక్కడే వైద్య విద్యను అభ్యసించే అవకాశం వచ్చిందన్నారు. ఈ నెల 15న ముఖ్యమంత్రి కేసీఆర్ వర్చువల్ గా  9 మెడికల్ కళాశాలను ప్రారంభించనున్నట్లు వివరించారు. అదేవిధంగా 16న నూతన మండలంగా ఏర్పడిన గోరికొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయంను మంత్రి సత్యవతి రాథోడ్ చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందన్నారు. 

మండల ఆఫీసుల ఏర్పాటుతో గోరికొత్తపల్లి ప్రాంత ప్రజలకు అడ్మినిస్ట్రేషన్ సకాలంలో అందుతుందని తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా 50 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, ఇందులో భాగంగా ముందుగా  రూ.30 కోట్లు ఒక్కసారి, రూ. 20 కోట్లు రెండోవిడతలో మంజూరు చేయగా, భూపాలపల్లి పట్టణంలో వార్డుల పర్యటనలో భాగంగా గుర్తించిన సమస్యలను, మున్సిపల్ కౌన్సిలర్లు గుర్తించిన ముఖ్యమైన పనులకు ప్రతిపాదనలు పంపడం జరిగిందని, తొందరలోనే వాటికి టెండర్లు పిలిచి, పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ సెగ్గం వెంకటరాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్ధన్, ఏఎంసీ చైర్మన్, ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.