జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షం..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షం..
  • జలాశయాలకు చేరుతున్న వరదనీరు..
  • పొంగి పొర్లుతున్న వాగులు, నదులు..

  ముద్ర ప్రతినిధి జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంగళవారం భారీ వర్షం కురిసింది. సోమవారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి జలాశయాల్లోకి వరద నీరు భారీగా చేరుకుంటుంది. జిల్లాలోని వాగులు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. వాగుల్లో వరద ఉధృతి పెరుగుతుండడంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న రోడ్లు తెగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని కాళేశ్వరం గోదావరినదిలో నీటి ప్రవాహం పెరుగుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరినది లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో నీటిమట్టం పెరుగుతూ వస్తుంది. కాళేశ్వరం మెట్ల వద్ద గోదావరి నీటి మట్టం 7.520 మీటర్ల ఎత్తుకు పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు నీటి ప్రవాహం పెరగడంతో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో 503.8 మిమి వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలోని మహదేవపూర్ మండలంలో 18.6 మిమి, పలిమెల 21.8, మహా ముత్తారం 50.4, కాటారం 38.8, మల్హర్ 35, చిట్యాల 64.8, టేకుమట్ల 57, మొగుళ్లపల్లి 55.6, రేగొండ 73, గణపురం 41, భూపాలపల్లి మండలంలో 47మిమి గా వర్షపాతం నమోదు అయినట్లు అధికార వర్గాలు తెలిపాయి.