రమణారెడ్డి గెలుపు ప్రజల గెలుపు కావాలి..

రమణారెడ్డి గెలుపు ప్రజల గెలుపు కావాలి..
  • గ్రామాలలో జరిగిన అభివృద్ధి కనిపించని పార్టీలకు కంటి వెలుగు పరీక్షలు చేసుకోవాలి..
  • ప్రజా ఆశీర్వాద యాత్రలో ఎమ్మెల్యే అభ్యర్ది గండ్ర వెంకటరమణా రెడ్డి..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో నా గెలుపు ప్రజల గెలుపు కావాలని, అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతున్నానని భూపాలపల్లి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ది గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. మంగళవారం రోజున మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో కలిసి భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామంలో ప్రజా ఆశీర్వాద యాత్రలో పాల్గొని  ప్రజలను ఓట్లు అభ్యర్దించారు.

కమలాపూర్ ప్రధాన రహదారి నుంచి మహిళల కొలటాలతో అపూర్వ స్వాగతం పలుకుతూ గ్రామ నడిబొడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు రాగానే ప్రతిపక్ష పార్టీలకు రాష్ట్ర ప్రజలు, ప్రయోజనాలు గుర్తుకు వస్తున్నాయన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో కానరాని పార్టీలకు, ఎన్నికల్లో ప్రజలను ఓటు అడిగి హక్కు లేదని విమర్శించారు.
రేవంత్ రెడ్డి మానసిక స్థితి బాగాలేదని, తెలంగాణ రైతుల పాలిట కాంగ్రెస్ పార్టీ శాపంగా మారిందన్నారు. కర్ణాటకలో పరిపాలన చేతగాని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గ్యారెంటీలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నాలుగు గంటల కరెంటు చాలు అని రైతులను అవహేళన చేస్తూ, పలుమార్లు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డిని తెలంగాణ నుంచి బహిష్కరించాలని కోరారు. రైతు రాజ్య స్థాపన పునరావృతం కావాలంటే మళ్లీ బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని, చేసిన అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే కేసీఆర్ నాయకత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు బలపరచాలని కోరారు. 

గడిచిన పదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమాలు కొనసాగిస్తూనే రానున్న ఐదేళ్లకు ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన మేనిఫెస్టో అమలు చేసి తీరుతామని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు  ఎన్నికల మేనిఫెస్టో ఆశాజనకంగా రూపొందించడం జరిగిందని, ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుంచే సంక్షేమ పథకాలు అమలులోకి వస్తాయని వివరించారు. విశ్వసనీయత లేని నాయకులు, నియోజకవర్గమే కుటుంబంగా భావించి నిరంతరం ప్రజల మధ్యలో ఉంటున్న నాపై విష ప్రచారం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. 2009కి ముందు అడవి గ్రామాలు ఎట్లుండే, ప్రస్తుతం జరిగిన అభివృద్ధి ఎలా ఉంది ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భూపాలపల్లిలో వెంకటేశ్వర స్వామి దేవాలయం కడితే అవినీతి చేశానని ఆరోపణలు చేస్తున్న నాయకులకు రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని తెలిపారు. 30 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ పయనంలో ఏ ఒక్కరోజు ఒక్కరి దగ్గర పైసా ఆశించిన దాఖలాలు లేవని, సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న పొడుపట్టా హక్కుపత్రాలు ఇప్పించానని, గిరి వికాస పథకం కింద గిరిజన వ్యవసాయ ఆధారిత భూములకు బోర్లను వేయించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వెయ్యి రూపాయలు ఉన్న గ్యాస్ ధరలు తగ్గించి రూ.400 లకు ఇవ్వడం జరుగుతుందని, రూ.10 లక్షలు ఆరోగ్య శ్రీ బీమా పథకం రూ.15 లక్షలకు పెంచుతూ మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలవడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న అర్హులందరికీ సన్న బియ్యం అందజేయడం జరుగుతుందని, రాష్ట్రంలో ఉండి అర్హత పొందిన ప్రతి ఒక్కరికి కేసిఆర్ భీమా ప్రతి ఇంటికి ధీమా పథకం ద్వారా ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా అందిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.