ప్రజావాణికి జిల్లా అధికారులు కచ్చితంగా హాజరు కావాలి... జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

ప్రజావాణికి జిల్లా అధికారులు కచ్చితంగా హాజరు కావాలి...  జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జిల్లా అధికారులు ప్రజావాణి కి తప్పని సరిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా వాణి కార్యక్రమాన్ని నిర్వహించి పలు సమస్యలపై దరఖాస్తదారుల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని, ద్వితీయ శ్రేణి అధికారులు, సిబ్బందిని హాజరవుతున్నట్లు గమనించడం జరిగిందని, ఇకముందు జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. భూ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు,గృహలక్ష్మి, రెండు పడక గదుల ఇండ్లు కేటాయింపు, పింఛన్లు మంజూరు, తదితర అంశాలపై 46 దరఖాస్తులు రావడం జరిగాయని తెలిపారు. రాష్ట్రస్థాయి లో జరిగే ప్రజావాణిలో జిల్లా కు సంబంధించి ఇప్పటివరకు ఐదు విడతల్లో 90 అర్జీలు రావడం జరిగాయని తెలిపారు. ఇందులో 58 అర్జీలకు సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి జవాబు సమర్పించడం జరిగిందని, మిగతావి పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. ఆయా అర్జీలకు సంబంధించిన క్లుప్తంగా వివరణలు దరఖాస్తు దారునికి పంపుతూ కలెక్టరేట్ కార్యాలయానికి ప్రతిని పంపించాలని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర స్థాయి అర్జీలకు సంబంధించిన వివరాలు రిజిస్టర్ లో నమోదు చేయాలని, అర్జీల పై తీసుకున్న చర్యలు ఆ రిజిస్టర్ లో నమోదు చేయాలని అన్నారు.

ప్రజావాణి అనంతరం సమన్వయ సమావేశం లో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో మామిడి, పసుపు, నువ్వుల పంటల సాగు ఎక్కువగా ఉన్నందున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ల స్థాపనకు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారుచేయాలని వ్యవసాయం, ఉద్యానవనం, పరిశ్రమల శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లాలో పండిస్తున్న మామిడి రైతులకు అవగాహన కల్పించి బ్రాండెడ్ మామిడి ఇతర ప్రాంతాలకు ఎక్స్ పార్ట్ చేసే విధంగా ప్రోత్సహించాలని తెలిపారు. జిల్లాలోని రైతులకు అదనపు ఆదాయ మార్గాల క్రింద కూరగాయల సాగుకు ప్రోత్సహించాలని ఉద్యానవన అధికారులకు సూచించారు. రానున్న సమ్మక్క సారలమ్మ జాతరకు జిల్లా నుండి వెళ్ళే భక్తులకు ఆర్టీసి బస్సులను నడిపించాలని ఆర్టీసి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీఓ రాజేశ్వర్, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నరేష్, కలెక్టరేట్ ఎఒ హన్మంతు రావు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.