ఎన్నికల విధులు పక్కాగా నిర్వహించాలి

ఎన్నికల విధులు పక్కాగా నిర్వహించాలి

రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకుడు బిఆర్.బాలకృష్ణ 
ముద్ర ప్రతినిధి, జనగామ : ఎన్నికల సిబ్బంది తమ విధులను పక్కాగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకుడు బి.ఆర్ బాలకృష్ణ సూచించారు. గురువారం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సి.హెచ్ శివలింగయ్య, జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు తులేశ్వర్ ప్రసాద్, గన్నత్ ఝ, డీసీపీ సీతారాంతో కలిసి ఆయన జిల్లా ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ (1950)ను పరిశీలించారు. వీడియో సర్వే లైన్స్ సిస్టం, సీ-విజిల్, సువిధ , మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ సెల్, సోషల్ మీడియా మానిటరింగ్ సెల్‌ను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రధాన సమావేశ సమావేశ మందిరంలో జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల వ్యయ పరిశీలన వివరాలు, నోడల్ ఆఫీసర్స్ తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. 

ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం రోజువారి వివరాలు వ్యయ పట్టికలు, సీజింగ్ చేసిన వివరాలు, ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఆదాయపు పన్ను శాఖ, బ్యాంకింగ్ రోజు వారి లావాదేవీలు, అనుమానిత చెల్లింపు వార్తలు, సోషల్ మీడియా వాట్సప్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇంస్టాగ్రామ్‌లను నిత్యం గమనిస్తూ వ్యయ వివరాలు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. జిల్లా ఎన్నికల అధికారి శివలింగయ్య మాట్లాడుతూ జిల్లాలోని మూడు నియోజకవర్గాలు జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘనపూర్‌‌ పరిధిలో ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేక విభాగాల నోడల్ అధికారులను నియమించినట్టు చెప్పారు. 

 ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పక్కాగా విధులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రోజువారీ నివేదికలు, తీసుకుంటున్న చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయన వివరించారు. ఈ సమీక్షలో ఉప ఎన్నికల అధికారి  సుహాసిని, ఎలక్షన్ నోడల్ ఆఫీసర్స్ సయ్యద్ ఇస్మాయిల్, వినోద్ కుమార్, ఏసీపీలు, ఎన్ఐ సి రాంప్రసాద్, ఈడీఎం దుర్గారావు, ఎంసీఎంసీ సభ్యులు కన్నా పరశరాములు, ఎల్.మణికుమార్, కలెక్టర్ ఏవో రవీందర్, ఎన్నికల విభాగం సిబ్బంది తదితరులు ఉన్నారు.