సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్...

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్...
  • హైకోర్టు తీర్పుతో వీడిన ఉత్కంఠ

ముద్ర ప్రతినిధి ,పెద్దపల్లి:-సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్  ఇచ్చింది. ఈనెల 27వ తేదీన  షెడ్యూల్ ప్రకారమే  ఎన్నికలు నిర్వహించాలని తీర్పు వెల్లడించింది. కొద్దిరోజులుగా అటు కార్మిక సంఘాలు, ఇటు కార్మికుల్లో  నెలకొన్న ప్రతిష్ఠంభనకు తెర పడింది. ఈనెల 27వ తేదీన జరగాల్సిన గుర్తింపు సంఘం ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎనర్జీ సెక్రటరీ హైకోర్టులో ఇటీవల పిటిషన్  దాఖలు చేశారు. దాంతో హైకోర్టు  సింగరేణి యాజమాన్యం అభిప్రాయాలను కోరగా, యాజమాన్యం కూడా ప్రస్తుత పరిస్థితిలో ఎన్నికల నిర్వహణకు మరికొంత గడువు కావాలని కోర్టుకు విన్నవించింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడతాయని సింగరేణి వ్యాప్తంగా ప్రచారం జరుగుతుంది. అటు గనులపై కార్మిక సంఘాల నాయకులు పోటాపోటీగా ప్రచారాలు చేపడుతూ వస్తున్నారు. హైకోర్టు తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందోనని ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం రాష్ట్ర హైకోర్టు నుంచి ఎన్నికలు యధావిధిగా జరపాలని తీర్పు వెల్లడించినట్లు సమాచారం. దీంతో ఎన్నికల సమరానికి కార్మిక సంఘాల నాయకులు దూకుడు పెంచేందుకుసిద్ధమవుతున్నారు.