గ్రామీణ ఆర్థిక ప్రగతి లక్ష్యంగా కిసాన్ మేళా

గ్రామీణ ఆర్థిక ప్రగతి లక్ష్యంగా కిసాన్ మేళా

కిసాన్ గ్రామీణ మేళా కన్వీనర్ పి సుగుణాకర్ రావు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: గ్రామీణ ఆర్థిక ప్రగతి పెంపొందించడమే లక్ష్యంగా కిసాన్ గ్రామీణ మేళాను నిర్వహిస్తున్నట్లు కిసాన్ గ్రామీణ మేళా కన్వీనర్ పి సుగుణాకర్ రావు వెల్లడించారు. బుధవారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ రైతుల ఆర్థిక స్వావలంబన పెంపొందించడానికి తక్కువ ధరలకే వ్యవసాయ పనిముట్లు, విత్తనాలు ఈ ప్రదర్శనలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అత్యాధునిక శాస్త్ర సాంకేతిక రంగంతో వ్యవసాయ విధానం, అధిక పంట పండించడం, ఎక్కువ ధరకు అమ్మడం వంటి వాటిపై పూర్తి అవగాహన వస్తుందని తెలిపారు. మత్స్య సంపద, గొర్రెల పెంపకం, పౌల్ట్రీ, డెయిరీ రంగాలలో అధిక లాభాలు ఎలా పొందాలో ఆయా రంగాలలోని నిష్ణాతులతో అవగాహన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.

గత సంవత్సరం నిర్వహించిన మేళాతో కరీంనగర్ రైతాంగంలో పెను మార్పు వచ్చినట్లు వెల్లడించారు. తెలంగాణలోని అత్యధిక రైతులు సందర్శించిన కిసాన్ మేళా గా రికార్డు సృష్టించిందని పేర్కొన్నారు. అక్టోబర్ 9, 10 ,11 తేదీలలో స్థానిక పద్మనాయక కళ్యాణ మండపంలో ఈ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్తర తెలంగాణకు సంబంధించిన సుమారు 75 వేల మంది రైతులు ఎగ్జిబిషన్ ను సందర్శించే అవకాశం ఉన్నట్లు చెప్పారు. దీంతో తెలంగాణలోనే అతిపెద్ద రైతు ఎగ్జిబిషన్ గా ఆవిర్భవించనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. మత్స్య, గొర్రెల సంపదను అంతర్జాతీయంగా మార్కెటింగ్ చేయడానికి అనేకమార్గాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు నియోజకవర్గం బిజెపి ఇన్చార్జ్ గడ్డం నాగరాజు, సీనియర్ నాయకులు కన్నబోయిన ఓదెలు, బేతి మహేందర్ రెడ్డి తోపాటు పలువురు పాల్గొన్నారు.