పేపర్ లీక్ బిజెపి కుట్రే

పేపర్ లీక్ బిజెపి కుట్రే
  • పచ్చగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెడుతున్న సంజయ్
  • బండి ప్రమేయం ఉండడంతోనే అరెస్ట్
  • బీహార్ విష సంస్కృతిని తెలంగాణ కు తెస్తున్న బిజెపి
  • రాష్ట్రమంత్రి గంగుల కమలాకర్

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : పదవ తరగతి పరీక్ష పత్రాల లీక్ బిజెపి కుట్రలో భాగమే అని రాష్ట్ర  పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. స్థానిక మీసేవ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో బీహార్ సంస్కృతిని ప్రేరేపిస్తూ అలజడి సృష్టించి లబ్ధి పొందాలని చూడడం హేయమైన చర్య అన్నారు. బాధ్యత కలిగిన ఎంపీ బండి సంజయ్ హిందీ పేపర్ ను రాష్ట్రవ్యాప్తంగా వైరల్ చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. పేపర్ లీక్ ముందస్తు ప్రణాళికలో భాగంగానే కరుడుగట్టిన బిజెపి కార్యకర్త ప్రశాంత్ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు వాట్సప్ ద్వారా ప్రశ్నాపత్రం పంపించాడని ఆరోపించారు. తద్వారా తెలంగాణలోని బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అబాసుపాలు  చేయాలని నీచమైన ఆలోచనలు చేయడం దురదృష్టకరమన్నారు. ప్రశ్న పత్రాల లీక్ లో బండి సంజయ్ ప్రమేయం ఉండడంతోనే రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసిందని వెల్లడించారు. లక్షలాదిమంది తల్లిదండ్రుల కడుపుకోతకు కారణం బండి సంజయ్ చర్యలే అని ఆరోపించారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకు లో కూడా బిజెపి ప్రమేయం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. బిజెపి ఎన్ని కుట్రలు పన్నినా చేదించి ప్రజల ముందు దోషిగా నిలబెడతామని వెల్లడించారు. దీని వెనకాల ఏ స్థాయి వ్యక్తులు ఉన్న అరెస్టు చేసి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అధికారకాంక్షతో స్వార్థ రాజకీయాల కోసం విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసంమన్నారు. తొమ్మిది సంవత్సరాల కేసీఆర్ పాలనలో అన్ని పరీక్షలు పగడ్బందీగా నిర్వహించామని వెల్లడించారు. ఎన్నికల సంవత్సరం కావడంతోనే బిజెపి కుట్ర రాజకీయాలు చేస్తూ నిజస్వరూపాన్ని బయటపెడుకుంటుందని తెలిపారు. తెలంగాణలోని ఏ ఒక్క విద్యార్థికి అన్యాయం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు ఈ సమావేశంలో టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు సుడా చైర్మన్ జివి రామకృష్ణారావు మేయర్ వై సునీల్ రావు గ్రంథాలయ కమిటీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ కార్యకర్తలు ప్రశాంత్ తోపాటు పలువురు పాల్గొన్నారు