సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి

సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి
  • సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :రెండు దశాబ్దాలుగా పాలక ప్రభుత్వాలు కనీస వేతనాలు ఇవ్వకుండా వెట్టిచాకిరి చేయిస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం రోజున సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్న దీక్షా శిబిరాన్ని సందర్శించి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించి మాట్లాడుతూ సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చి ఆచరణలో పూర్తిగా విఫలమైనారని అన్నారు.
 సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చట్టాలు చెబుతున్న అమలులో ప్రభుత్వ యంత్రాంగం సంవత్సరాలుగా జాప్యం చేయడం సరి కాదన్నారు.

19 సంవత్సరాలుగా సీఆర్పీలు కాంట్రాక్టు ఉద్యోగ ఉపాధ్యాయ బాధ్యతల్లో విధులు నిర్వహిస్తున్నారని, అందరికీ విద్య అందడం కోసం వీరి పాత్ర ముఖ్యమైనదని అన్నారు. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులందరినీ ఆంధ్రప్రదేశ్లో రెగ్యులర్ చేశారని సహజమైన మరణం సంభవిస్తే రెండు లక్షలు ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లిస్తున్నారని గుర్తు చేశారు. మరణించిన వారిని ప్రభుత్వాలు ఆదుకున్న దాఖలాలు లేవని వీరి జీవితాలు అనాధలుగా మిగిలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లకు కేవలం  సంవత్సరానికి పది నెలల వేతనం మాత్రమే ఇస్తున్నారని 12 నెలల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒకేషనల్ టీచర్లుగా గుర్తించాలన్నారు. సమగ్ర శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న మహిళలకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరణించిన ఉద్యోగులకు ఐదు లక్షలు ప్రమాదవశాత్తు మరణిస్తే 20 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పిఎఫ్, ఈఎస్ఐ, లైఫ్ ఇన్సూరెన్స్, ట్రావెలింగ్ అలవెన్స్, ప్రభుత్వ స్కీములు అన్ని కూడా వర్తింప చేయాలని, కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో చేసే ఆందోళన పోరాటాలకు సిపిఎం పార్టీ ప్రత్యక్షంగా పరోక్షంగా అండగా నిలబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు డి నరేష్ పటేల్, సంఘం జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, చంద్రకళ, రాజమౌళి శ్రీను తదితరులు పాల్గొన్నారు.