ప్రభుత్వ భూములు ఆక్రమిస్తాం- వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తాం- వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : స్థానిక కోతి రాంపూర్ లోని ముకుంద లాల్ మిశ్రా భవన్ లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం కవ్వంపల్లి అజయ్ అధ్యక్షతన నిర్వహించారు
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. ప్రసాద్ హాజరై మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఆవాస్ యోజన పథకం కింద పేదలకు ఇల్లు నిర్మిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక పేదలను విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తామని, అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు ఇస్తామని అధికారంలోకి వచ్చాక, ఏ ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చిన పాపాన పోలేదని అన్నారు.
కరీంనగర్ నియోజకవర్గంలోని కమాన్ పూర్, రేకుర్తి, చింతకుంట, బొమ్మకల్, తీగల గుట్టపల్లి, సీతారాంపూర్ గ్రామాలలో ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూకబ్జాలు చేసి విక్రయిస్తుంటే ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను కబ్జాలు చేసిన ప్రజా ప్రతినిధులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులపై చర్యలు తీసుకొని  ప్రభుత్వ భూములను ఇంటి స్థలాలు లేని నిరుపేదలకు 100 గజాల చొప్పున పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
అర్హులైన పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వాలని, ఇంటి స్థలం ఉన్నవారికి 7 లక్షల రూపాయలు నిర్మాణానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములు ఆక్రమించి పేదలకు పంచుతామని హెచ్చరించారు
కార్మిక సంఘాల పోరాటం మూలంగా సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని, కావాలనే ఉపాధి హామీ పనులను తగ్గిస్తున్నారని అన్నారు.
ఉపాధి హామీ పనులు చేసే చోట కనీస సౌకర్యాలు కల్పించడం లేదని, ఎండ తీవ్రత అధికంగా ఉంది. పనిచేసే చోట నీడ సౌకర్యం కల్పించాలని తగిన పనిముట్లు అందజేయాలని అన్నారు.
పెరిగిన ధరలకు అనుగుణంగా ఉపాధిహామీ కూలీలకు వ్యవసాయ కార్మికులకు రోజుకూలి 600 రూపాయలు ఇవ్వాలని, సంవత్సరానికి 200 ల దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇల్లు లేని పేదలను గుర్తించి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇంటి స్థలాలు ఇవ్వాలని లేదంటే వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములను గుర్తించి జెండాలు పాతి స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. 
ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా మాజీ కార్యదర్శి గుడికందుల సత్యం, జిల్లా అధ్యక్షులు కవంపల్లి అజయ్,ఉపాధ్యక్షులు రాయికంటి శ్రీనివాస్,మాతంగి శంకర్, జిల్లా నాయకులు మల్లయ్య, సంఖ్య దుర్గయ్య మల్లేశం శంకర్ రవీందర్ శంకర్ బైరి సుమన్,డికొండ బాబ లక్ష్మి, రాధా,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.