కరీంనగర్ కు పాకిన టిఎస్పిఎస్సి లీకేజీ కేసు

కరీంనగర్ కు పాకిన టిఎస్పిఎస్సి లీకేజీ కేసు
  • ఇద్దరిని అరెస్టు చేసిన సిట్ అధికారులు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ  ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు కరీంనగర్ కు పాకింది. సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో తాజాగా మరో ఇద్దరు అరెస్ట్‌ అయ్యారు. పూల రమేష్‌కు హైటెక్ మాస్ కాపీయింగ్‌లో సహకరించేలా ఒప్పందం కుదుర్చుకున్నారన్న సమాచారంతో ఇద్దరిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్ లోని ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న విశ్వప్రకాష్, ఫిజికల్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు అరెస్ట్ అయ్యారు. ఏఈఈ, డీఏఓ పరీక్షా కేంద్రాల్లో నుంచి ప్రశ్నాపత్రాలు లీక్ చేసే విధంగా పూల రమేష్‌తో విశ్వప్రకాష్, వెంకటేశ్వర్లు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు విశ్వప్రకాశ్, వెంకటేశ్వర్లకు పూల రమేష్ అడ్వాన్స్‌గా ఐదు లక్షలు ఇచ్చినట్లు సెట్ అధికారులు గుర్తించారు. హైటెక్ మాస్ కాపీయింగ్ దర్యాప్తులో భాగంగా ఈ విషయాలను గుర్తించిన సిట్ అధికారులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరి అరెస్ట్‌తో లీకేజ్ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 53కు చేరింది. మరో 50 మంది దాకా ప్రశ్నాపత్రాలు లీకేజీ, హైటెక్ మాస్ కాపీయింగ్‌లో నిందితులు ఉన్నట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు మరిన్ని అరెస్ట్‌లు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.