గ్రామాల అభివృద్ధే సీఎం కేసీఆర్ గారి లక్ష్యం...

గ్రామాల అభివృద్ధే సీఎం కేసీఆర్ గారి లక్ష్యం...
  • రాష్ట్రంలో ప్రతి ఎకరానికి సాగునీరు.. 
  • ప్రతి ఇంటికి త్రాగునీరు ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వ ఎజెండా
  • చిగురుమామిడి మండలంలో 9 కోట్ల 44లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, భూమిపూజ
  • 17 గ్రామాలకు క్రీడా సామాగ్రి పంపిణీ
  • పనిచేసే బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి
  • హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ 

చిగురుమామిడి ముద్ర న్యూస్: తెలంగాణ పల్లెల్లో అభివృద్ధి కుసుమాలు విరబూస్తున్నాయి. ఏండ్ల తరబడి నిరాదరణకు గురైన గ్రామాలు నేడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యం తెలంగాణ రాష్టంలో సిద్ధిస్తోంది.గ్రామీణ తెలంగాణలో మౌళిక వసతుల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసి గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందని హస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. చిగురు మామిడి మండలంలో శనివారం 9కోట్ల 44లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, భూమిపూజ  చేశారు. చిరుమామిడి మండలానికి పలు అభివృద్ధి పనుల కోసం మరో 8 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఈ సందర్భంగా వెల్లడించారు.

కొండాపూర్ గ్రామంలో రూ.20లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన, సుందరగిరి గ్రామం నుండి ఉల్లంపల్లి గ్రామం వరకు రూ.2 కోట్ల 25లక్షల వ్యయంతో బీటీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన, కోహెడ ఆర్&బి రోడ్ నుండి ముదిమాణిక్యం గ్రామం వరకు రూ.1కోటి 50లక్షల వ్యయంతో బీటీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన,చిగురుమామిడి ఆర్&బి రోడ్ నుండి ముదిమాణిక్యం వయా అర్కాలపల్లి గ్రామం వరకు రూ.1కోటి 9.5లక్షల వ్యయంతో బీటీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన,చిగురుమామిడి మండల కేంద్రంలో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన అలాగే రేకొండ గ్రామం నుండి ఎక్లాస్ పూర్ వరకు రూ.2 కోట్ల 10.5లక్షల వ్యయంతో బ్రిడ్జ్ నిర్మాణానికి, బీటీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మండలంలోని 17 గ్రామాలకు స్పోర్ట్స్ కిట్లు, క్రికెట్ కిట్లు, టీ షర్ట్ కిట్లు,  డంబుల్ సెట్లు మొత్తం 68 కిట్లు గ్రామ సర్పంచులకు అందజేశారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన  8మంది లబ్ధిదారులకు 1,69,000 రూపాయల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.

అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ...
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని గ్రామలలో సీసీ రోడ్లు, మురికి కాలువలు, మరుగు దొడ్లను ప్రభుత్వం నిర్మిస్తోందని ప్రతి గ్రామ అభివృద్ధికి నెల నెల ప్రభుత్వం నిధులు ఇస్తుందని అన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలోనే ఉన్నాయని తెలిపారు. వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు గ్రామాలలో సామాజిక భవనాలు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పౌరునికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని తెలిపారు.ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పల్లెలు ఎంతో వెనుకబాటులో ఉండేవని,స్వరాష్టం సాధించిన తర్వాత బంగారు తెలంగాణ లక్ష్యం గా సాగుతున్న కేసీఆర్ పాలనలో తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధిని సాధిస్తున్నాయని, నాటి సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో ఎంతో వెనుకబాటుకు గురయ్యామని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి గ్రామీణ ప్రాంతాలే పట్టుకొమ్మలని తెలిపారు. ప్రజలంతా కలిసికట్టుగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి, జడ్పిటిసి గీకురు రవీందర్, సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి వైస్ ఎంపీపీ బేతి రాజిరెడ్డి ఎంపీడీవో నర్సయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.