ఇండ్లస్థలాల కోసం కలెక్టరేట్ల ముందు ధర్నాలు- వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్

ఇండ్లస్థలాల కోసం కలెక్టరేట్ల ముందు ధర్నాలు- వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుపేదలకు ఇండ్లు,ఇండ్ల స్థలాలుడబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 10 న కలెక్టరేట్ల ముందు జరిగే ధర్నాలను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర  కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ పిలుపునిచ్చారు.

రెండు రోజుల పాటు జరిగినరాష్ట్ర కౌన్సిల్ సమావేశాల నిర్ణయాలను బుధవారం రోజున బద్దం ఎల్లారెడ్డి భవన్ లో వెల్లడించారు.

ఈ సందర్భంగా సృజన్ కుమార్ మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులు,ఉపాధి కులీల ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం,హక్కుల సాధన కోసం రాబోయే రోజుల్లో క్షేత్ర స్థాయిలో అధ్యయన యాత్రలు చేసి  వ్యవసాయ,ఉపాధి కూలీలను చైతన్యం చేసి పోరాటాలను ఉదృతం చేస్తామని, సమస్యల పరిష్కారంతో పాటు హక్కులను సాధించుకుంటామని అన్నారు.ఇండ్లు,ఇండ్ల స్థలాలు,డబుల్ బెడ్ రూమ్ లేని పేదలకు వెంటనే మంజూరు చేయాలని, అలాగే గతంలో ఇండ్లు లేని నిరుపేదలు ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని జీవిస్తున్న వారికి జీవో 58 ప్రకారం పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఉపాది హామీ కూలీలకు పనులు కల్పిస్తూ పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీల రేట్లను 600 రూపాయలకు పెంచాలని, పని దినాలను 200 రోజులకు పెంచాలని, పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, 50 సంవత్సరాలు నిండిన వ్యవసాయ కూలీలకు 5వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని, అర్హులైన వారికి రేషన్ కార్డులు, వృధ్యాప్య,వికలాంగుల,వితంతు పెన్షన్లు వెంటనే ఇవ్వాలని,రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులకు దళిత బంధు పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు బోయిని అశోక్,నాయకులు కూన రవిందర్, పైడిపల్లి రాజు,పిట్టల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు