ఆఫ్గాన్​పై భారత్​ ఘన విజయం 

ఆఫ్గాన్​పై భారత్​ ఘన విజయం 
  • రోహిత్​ 63 బంతులలో సెంచరీ 
  • రాణించిన కొహ్లీ , ఇషాన్ , అయ్యర్ 
  • 4 వికెట్లతో మెరిసిన జస్ ప్రీత్ బుమ్రా

న్యూఢిల్లీ :  ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా  ఢిల్లీలో భారత్ .. అఫ్గానిస్తాన్  మధ్య జరిగిన  వన్డే  మ్యచ్​లో   టీం ఇండియా ఘన విజయం సాధించింది.  నిర్ణీత 273 పరుగుల లక్ష్యాన్ని  35 ఓవర్లలో 8 వికెట్లు మిగిలి ఉండగానే  సాధించారు. అఫ్గానిస్థాన్‌ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడిన  కెప్టెన్​ రోహిత్‌ కేవలం 63 బంతుల్లోనే సెంచరీ  ( 131 ) పూర్తి చేసుకున్నాడు.  కోహ్లీ 55 పరుగులు  ( నాటౌట్​ ) ఇషాంత్​ కిషన్​ 47 పరుగులు , శ్రేయస్ అయ్యర్​ 25 పరుగులు ( నాటౌట్ ) చేసారు.    అంతకుముందు టాస్ గెలిచి  బ్యాటింగ్​ తీసుకున్న అఫ్గాన్​ జట్టు భారత బౌలింగ్ ను వీరోచితంగా ఎదుర్కొన్నారు. అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 272 పరుగులు చేసింది. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (88 బంతుల్లో 80; 8 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ గా నిలిచాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ (69 బంతుల్లో 62; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ శతకంతో మెరిశాడు. దాంతో అఫ్గానిస్తాన్ మెరుగైన స్కోరును అందుకుంది.  భారత బౌలర్లలో జస్ ప్రీత్ బుమ్రా 4 వికెట్లతో మెరిశాడు. హార్దిక్ పాండ్యాకు రెండు వికెట్లు లభించాయి. తొలుత బ్యాటింగ్ కు దిగిన అఫ్గానిస్తాన్ ఆరంభంలోనే వికెట్లను కోల్పోయింది. ఇబ్రహిం జద్రాన్ (22), రహ్మనుల్లా గుర్బాజ్ (21), రహ్మత్ షా (16) వికెట్లను కోల్పోయింది. దాంతో అఫ్గానిస్తాన్ జట్టు 63 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హష్మతుల్లా షాహిది, అజ్మతుల్లా ఒమర్జాయ్ లు జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు ఓపికగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపారు. లూజ్ బాల్స్ ను బౌండరీలకు తరలిస్తూ వేగం పెంచారు. వీరిద్దరు 4వ వికెట్ కు 121 పరుగులు జోడించారు. అయితే హార్దిక్ పాండ్యా ఒమర్జాయ్ ను అవుట్ చేశాడు. అనంతరం కుల్దీప్ యాదవ్ షాహిదిని వెనక్కి పంపాడు. అనంతరం వచ్చిన బ్యాటర్లు పెద్దగా పరుగులు సాధించలేకపోయారు. ఒక దశలో 300 చేసేలా కనిపించిన అఫ్గానిస్తాన్ ఆ స్కోరుకు 28 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఇక ఈ మ్యాచ్ లో జస్ ప్రీత్ బుమ్రా రాణించాడు. ఆరంభంలో ఓపెనర్ జద్రాన్ ను అవుట్ చేసి భారత్ కు శుభారంభం చేశాడు. ఆ తర్వాత కీలక సమయంలో మొహమ్మద్ నమీ వికెట్ ను తీసి భారత్ కు మరోసారి బ్రేక్ అందించాడు. వీరిద్దరితో పాటు నజీబుల్లా జద్రాన్, రషీద్ ఖాన్ లాంటి పవర్ హిట్టర్లను అవుట్ చేసి అఫ్గానిస్తాన్ మరిన్ని పరుగులు చేయకుండా అడ్డుకున్నాడు.