ఐపీఎల్‌ ట్రోఫీ ఆ జట్టుదే: మైకెల్ వాన్

ఐపీఎల్‌ ట్రోఫీ ఆ జట్టుదే: మైకెల్ వాన్

అహ్మాదాబాద్: ఐపిఎల్​2023 తొలి మ్యాచ్‌ గుజరాత్ టైటాన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగనుండగా కొత్తగా వచ్చిన గుజరాత్‌ జట్టు గత ఏడాది ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, ఈసారి ఎవరు విజేతగా నిలుస్తారనేది ఆసక్తిగా మారింది. అన్ని జట్లలో పెనుమార్పులు చోటు చేసుకోవడంతో అభిమానుల్లోనూ ఉత్కంఠ మరింత పెరిగింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ టైటిల్‌ను ఎగరేసుకుపోయే జట్టేదో వెల్లడించాడు. గతేడాది ఫైనల్‌లో గుజరాత్‌ చేతిలో ఓటమిపాలైన రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు ఈసారి విజేతగా నిలుస్తుందని జోస్యం చెప్పాడు. 'ఐపీఎల్‌ మ్యాచ్‌ల ప్రారంభం కోసం ఆత్రుతగా ఉన్నా. క్రిక్‌బజ్‌తో జట్టు కట్టేందుకు ఎదురుచూస్తున్నా. ఈ సంవత్సరం కప్ రాజస్థాన్‌ రాయల్స్‌దే.

ఈసారి ఐపీఎల్‌ ట్రోఫీని సొంతం చేసుకునే జట్టు రాజస్థాన్‌'' అని మైకెల్‌ వాన్‌ ట్వీట్‌ చేశాడు. 2008లో జరిగిన ఐపీఎల్‌ తొలి సీజన్‌లో షేన్ వార్న్ సారథ్యంలోని రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు టైటిల్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. అప్పటినుంచి ఇప్పటి వరకు రాజస్థాన్ మరోసారి విజేతగా నిలవలేకపోయింది. గతేడాది ఫైనల్‌కు చేరినప్పటికీ.. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో హార్థిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్‌ టైటాన్స్ విజయం సాధించి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.

ఈ సీజన్‌లో 2008లోని ఫలితం పునరావృతం అవుతుందని మైకేల్ వాన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. సంజూ శాంసన్‌ నాయకత్వంలోని రాజస్థాన్‌ ఈసారి గట్టిపోటీదారుగా ఉంటుందని, టైటిల్‌ను సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాన్‌ తెలిపాడు. ఇంగ్లాండ్‌ సీనియర్ ఆటగాడు జో రూట్‌ ఐపీఎల్‌లో తొలిసారిగా ఆడబోతున్నాడు. ఇతను జట్టుకు మిడిలార్డర్‌లో కీలకమవుతాడని రాజస్థాన్‌ భావిస్తోంది. ఏప్రిల్ 2న హైదరాబాద్‌‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్‌తో... రాజస్థాన్‌ తన తొలి మ్యాచ్‌లో తలపడనుంది.