బీఆర్‌‌ఎస్‌ హయాంలో బీసీలకు అన్యాయం

బీఆర్‌‌ఎస్‌ హయాంలో బీసీలకు అన్యాయం

కర్నాటక ఎమ్మెల్సీ, సీడబ్ల్యూసీ మెంబర్‌‌ బీకే.హరిప్రసాద్

ముద్ర ప్రతినిధి, జనగామ : బీఆర్‌‌ఎస్‌ హయాంలో రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరిగిందని కర్నాటక ఎమ్మెల్సీ, సీడబ్ల్యూసీ మెంబర్‌‌ బీకే.హరిప్రసాద్ అన్నారు. కేసీఆర్‌‌ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలో బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు. మంగళవారం జనగామకు వచ్చిన ఆయన కాంగ్రెస్ జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం బీసీలకు సంక్షేమ నిధి, ఫీజు రీయింబర్స్‌మెంట్, బీసీ బంధు వంటి సంక్షేమ పథకాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. బీసీ కార్పొరేషన్‌లో 5.7 లక్షల రుణాల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. బీసీలకు అన్యాయం చేసిన బీఆర్‌‌ఎస్‌కు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు.

ఈసారి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు నెలల్లోగా కుల గణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లను పెంచుతామని చెప్పారు.  పంచాయతీలు, మునిసిపాలిటీల్లో ఉన్న 3,973 మంది బీసీలకు కొత్త పదవులు ఇవ్వడంతో పాటు ప్రస్తుతం ఉన్న 23 శాతం ఉన్న రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామన్నారు.  అన్ని ప్రభుత్వ కాంట్రాక్టుల్లో (సివిల్ లేదా మెయింటెనెన్స్) బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. సంవత్సరానికి రూ.20 వేట్ల చొప్పున ఐదేళ్లలో లక్ష కోట్లను బీసీల అభివృద్ధి ఖర్చు చేస్తామన్నారు. బీసీ యువతకు చిరువ్యాపారం, విద్య కోసం రూ.10 లక్షల రూణం అందిస్తామన్నారు. వీటితో పాటు కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో పలు అంశాలను వివరించారు. సమావేశంలో ఏఐసీసీ సభ్యులు రుక్సానా, మున్సిపల్ మాజీ చైర్మన్ వేమళ్ల సత్యనారాయణ రెడ్డి, పీసీసీ సభ్యుడు చెంచారపు శ్రీనివాస్ రెడ్డి, జనగామ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బనుక శివరాజ్ యాదవ్, చారబూడ్ల రాందయాకర్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి మేడ శ్రీనివాస్, బైరగోని రాజు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వంగాల కల్యాణి మల్లారెడ్డి, బక్క శ్రీను, ప్రకాష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.