ఏసీబీ వలలో జనగామ మున్సిపల్ కమిషనర్

- మార్టిగేజ్ రిలీజ్ కోసం రూ.40 వేలు డిమాండ్
- రెడ్ హ్యాండెండ్ పట్టుకున్న ఏసీబీ
ముద్ర ప్రతినిధి, జనగామ : జనగామ మున్సిపల్ కమిషనర్ జంపాల రజిత లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఈ ఏసీబీ దాడిలో కమిషనర్‌తో పాటు ఆమె డ్రైవర్ నవీన్‌కు కూడా పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. సోమవారం జరిగిన ఈ ఘటన వివరాలు వరంగల్ ఏసీబీ డీఎస్సీ సాంబయ్య కథనం ప్రకారం.. లింగాలఘణపురం మండలం బండ్లగూడెంకు చెందిన చిట్టిపల్లి రాజు జనగామ జిల్లా కేంద్రంలోని సూర్యాపేట రోడ్డులో 2022లో జీ ప్లస్–3 భవనం నిర్మించుకున్నాడు. అయితే నిర్మాణ సమయంలో నిబంధనల ప్రకారం ఇంటి స్థలంలో 10 శాతం భూమిని జనగామ మున్సిపాలిటీకి మార్టిగేజ్ చేశారు. దాదాని రిలీజ్ చేసుకోవడం కోసం రాజు కొన్ని రోజుల కింద మున్సిపాలిటీకి దరఖాస్తు చేసుకున్నారు. ఇందు కోసం కమిషనర్ జంపాల రజిత రూ.60 వేలు లంచం డిమాండ్ చేయడంతో రాజు అంత ఇచ్చుకోలేనని బతిమిలాడగా రూ.40 వేలకు బేరం కుదిరింది. అనంతరం బాధితుడు రాజు వరంగల్ ఏసీబీ డీస్పీ సాంబయ్యను ఆశ్రయించాడు. దీంతో వారు పథకం ప్రకారం కమిషనర్ రజితను ట్రాప్ చేశారు. రాజు ఒప్పుకున్న సొమ్మును ఇచ్చేందుకు సోమవారం జనగామ మున్సిపాలిటీకి వెళ్లి కమిషనర్ రజితకు ఫోన్ చేయగా తన కారు డ్రైవర్ నవీన్‌కు డబ్బులు ఇవ్వాలని సూచించింది. దీంతో రాజు డ్రైవర్ నవీన్‌కు డబ్బులు ఇవ్వగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కమిషనర్ ఆదేశాలతోనే తాను డబ్బులు తీసుకున్నానని డ్రైవర్ నవీన్ వాంగ్మూ లం ఇవ్వడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. వారిని హైదరాబాద్ నాంపల్లి ఏసీబీ కోర్టులో రిమాండ్ చేస్తామని చెప్పారు. ఈ దాడిలో ఎస్సైలు ఏసీబీ అధికారులు రవి, శ్యాం, శ్రీనివాస్ పాల్గొన్నారు.
తిరిగి తిరిగి విసిగిపోయా..
చిట్టిపల్లి రాజు, బాధితుడు
జనగామ మున్సిపాలిటీలో అవినీతి పెరిగిపోయింది. ఏ పర్మిషన్ కావాలన్నా అధికారులకు లంచం ఇవ్వాల్సిందే. నేను ఇంటి నిర్మాణం పర్మిషన్ కోసం అప్పట్లో 4 నెలలు ఆఫీస్ చుట్టూ తిరిగిన. ఇప్పడు మార్జిగేజ్ రిలీజ్ కోసం 45 రోజులుగా తిరుగుతున్నా.. అయినా కమిషనర్ పట్టించుకోలేదు. రూ.40 వేలు లంచం డిమాండ్ చేశారు. అందుకే ఏసీబీని ఆశ్రయించిన.