క్యూ నెట్ బాధితులకు  న్యాయం చేయాలి 

క్యూ నెట్ బాధితులకు  న్యాయం చేయాలి 

క్యూ నెట్ బాధితుల జేఏసీ కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ డిమాండ్ 
ముద్ర, ముషీరాబాద్: క్యూ నెట్ కంపెనీకి కట్టిన డబ్బులు బాధితులకు తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద శనివారం క్యూ నెట్ బాధితుల జేఏసీ ఆధ్వర్యంలో "ఆరని మంటల పోరాటం" పేరుతో  ధర్నా విర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి క్యూ నెట్ బాధితులు తరలివచ్చి ధర్నాలో పాల్గొని, క్యూ నెట్ ను నిషేదించాలని, స్వప్నలోక్ మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలనీ, క్యూ నెట్ బాధితుల పెట్టుబడులను తిరిగి ఇప్పించాలని పెద్దఎత్తున నినాదాలు చేసారు. ఈ సందర్బంగా ధర్నానుద్దేశించి తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ డైరెక్ట్ సెల్లింగ్, చైన్ మార్కెటింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో క్యూ నెట్ లాంటి సంస్థలు మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు.

ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (క్యూ నెట్) సంస్థలో డబ్బులు పెట్టుబడి పెట్టి మోసపోయిన బాధితుల సొమ్మును వాపసు ఇప్పించి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేసారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగులను మోసం చేస్తున్న చైన్ మార్కెటింగ్ కంపెనీలపై నిషేదం విధించకుండా ప్రధాని మోడీ ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుందని అయన ప్రశ్నించారు. హబ్సిగూడ, నాచారం, సికింద్రాబాద్ క్యూ నెట్ బ్రాంచీలలో లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి మోసపోయిన దాదాపు 300 మంది బాధితులకు డబ్బులు వాపసు ఇప్పించి, సిట్ తో దర్యాప్తు జరిపించి, క్యూ నెట్ సంస్థ యాజమాన్యంపై కఠిన క్రిమినల్ చెర్యలు తీసుకోవాలని అయన డిమాండ్ చేసారు. ఈ ధర్నాలో ఆప్ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు బుర్ర రాము గౌడ్, నేతలు అన్సారీ, రాకేష్ సింగ్, జావేద్, మజీద్, ఫణి భూషణ్, క్యూ నెట్ బాధితుల జేఏసీ నేతలు ఆనంద్, మమతా, శ్రవణ్, వినయ్, కళ్యాణి, కృష్ణ వంశి, మురళి, రామకృష్ణ, దీప్తి తదితరులు పాల్గొన్నారు.