కరీంనగర్ సుందర నగరం

కరీంనగర్ సుందర నగరం

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ ను ప్రకాశవంతమైన వెలుగులతో సుందర నగరంగా తీర్చిదిద్దుతున్నామని కరీంనగర్ కార్పొరేషన్ మేయర్  సునీల్ రావు అన్నారు.  నగర అభివృద్ధిలో భాగంగా గురువారం  25వ డివిజన్ లో మేయర్  పర్యటించారు. స్థానిక కార్పొరేటర్ అశోక్ తో కలిసి నగరపాలక సంస్థకు చెందిన మూడు లక్షల నిధులతో  హైమాస్ లైట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ నగరానికి వన్నె తెచ్చే విధంగా వీధి దీపాల నిర్వహణ చేసినట్లు తెలిపారు. రాత్రి సమయాల్లో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడకుండా నగరపాలక సంస్థ ద్వారా ప్రతి డివిజన్ లో, ప్రధాన రహదారుల వెంబడి చక్కటి లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. నగరవ్యాప్తంగా 60 డివిజన్లో  500 కు పైగా హైమాస్ లైట్లు అమర్చామని వెల్లడించారు.

అదనంగా మరిన్ని హైమాస్ లైట్లు ఏర్పాటు చేసేందుకు టెండర్ పిలిచామన్నారు. నగరంలోని నాలుగు వైపులా అన్ని ప్రధాన రహదారులలో ఇప్పటికే చక్కటి సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పద్మనగర్ చౌరస్తా వరకు, కమాన్ చౌరస్తా నుండి కేబుల్ బ్రిడ్జి వరకు అన్ని వైపులా సెంటర్ లైటింగ్ సిస్టం అమర్చి నగరానికి వన్నె తెచ్చామన్నారు. నగరవ్యాప్తంగా ఉన్న 60 డివిజన్లో ప్రతి వీధిలో ఎల్ఈడీ లైట్లు తో పాటు చౌరస్తాల వద్ద హైమాస్ లైట్లను కూడా ఏర్పాటుచేసి ప్రజలకు సౌకర్యాలు కల్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.