సైబర్ నేరాలపై వెంటనే కేసులు నమోదు చేయాలి

సైబర్ నేరాలపై వెంటనే కేసులు నమోదు చేయాలి

పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు సైబర్ నేరాలు జరిగిన వెంటనే కేసులను నమోదు చేయాలని కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు కమీషనరేట్ లోని పోలీస్ అధికారులను ఆదేశించారు. వెంటనే కేసులు నమోదు చేయడం ద్వారా సైబర్ నేరాల ద్వారా తస్కరించబడిన డబ్బుల లావాదేవీలను నిలుపుదల చేసి బాధితులకు అందజేసే అవకాశం ఉంటుందని చెప్పారు. శుక్రవారం కరీంనగర్ కమీషనరెట్ కేంద్రంలో కమీషనరేట్ పోలీసుల అర్థ వార్షిక నేరసమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ వివిధ రకాల నేరాల నియంత్రణ కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేరాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేయాలని చెప్పారు. శాంతిభద్రలకు సంబంధించి ఎలాంటి సమాచారం అందిన సత్వరం స్పందించి సంఘటన స్థలానికి చేరుకుని సేవలందించాలని తెలిపారు. పనిచేయని సీసీ కెమెరాలకు వెంటనే మరమ్మత్తులు చేయించాలని చెప్పారు. ప్రధానంగా ప్రధాన కూడళ్ళల్లోని కెమెరాలు పనిచేసే విధంగా చూసుకోవాలని తెలిపారు. ప్రతి 15 రోజులకు ఒకసారి సీసీ కెమెరాలు పనితీరును సమీక్షించాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు ప్రతిరోజు పనిచేసే విధంగా చూసుకోవాలని చెప్పారు. సాంకేతిక కా

రణాలతో పని చేయకపోయినట్లయితే కమీషనరేట్ కేంద్రానికి వెంటనే సమాచారం అందించాలని చెప్పారు. గంజాయి ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా విక్రయాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. వివిధ రకాల కేసుల చేదన కోసం ప్రత్యేక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. పోలీస్ అధికారులు ప్రతి కేసు వివరాలపై పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ఆకస్మిక తనిఖీలతో అక్రమ కార్యకలాపాలు నియంత్రణలోకి వస్తాయని చెప్పారు. గత ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులు పరిష్కరించబడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేసుల పరిష్కారం కోసం ఇరువర్గాలను సంప్రదించాలని తెలిపారు. కొన్ని సున్నితమైన కేసుల నమోదు విషయంలో న్యాయ నిపుణులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిపిలు ఎస్ శ్రీనివాస్ (శాంతిభద్రతలు) జి చంద్రమోహన్ (పరిపాలన) అడిషనల్ డిసిపి (సిఏఆర్) భీంరావు, ట్రైనీ ఐపీఎస్ అధికారి గీత్ మహేష్ బాబా సాహెబ్, ఎసిపి లు నరేందర్, కరుణాకర్ రావు, విజయ్ కుమార్, మదన్ లాల్, శ్రీనివాస్, సి ప్రతాప్, కాశయ్య జీవన్ రెడ్డి, ఎస్బిఐ జి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.