Largest snake fossils - గుజరాత్‌లో అతిపెద్ద పాము శిలాజాలు గుర్తింపు

Largest snake fossils -  గుజరాత్‌లో అతిపెద్ద పాము శిలాజాలు గుర్తింపు

ముద్ర,సెంట్రల్ డెస్క్:- గుజరాత్ లో 2005లో వెలికితీసిన ఓ పాము వెన్నెముక శిలాజాలం భూమ్మీద ఇప్పటివరకు జీవించిన అతిపెద్ద పాము అవశేషమని శాస్ర్తవేత్తలు వెల్లడించారు. ఆ పాము టీ రెక్స్ కన్నా పొడవైనదని తెలిపారు. ఐఐటీ రూర్కీకి చెందిన శాస్ర్తవేత్తలు 2005లో గురించిన పాము శిలాజాలానికి వాసుకి ఇండికస్ అని పేరుపెట్టారు. తాజాగా దాన్ని జెయింట్ స్నేక్ గా నిర్ధారించారు. వివిధ జాతులు ప్రత్యేకించి సరీసృపాల (రెప్టైల్స్) ఆవిర్భావం, పరిణామ ప్రక్రియలో భారత్ తో ఉన్న సంబంధం ఈ పరిశోధన తెలియజేస్తుందని చెప్పారు.

పాము శిలాజాలానికి చెందిన 27 వెన్నెముక భాగాలను పరిశోధకులు గతంలో కనుగొన్నారు. వాటిలో కొన్ని ఎముకలు భారీ కొండ చిలువను పోలి ఉన్నాయి. అలాగే అవి విషపూరితం కానివి అయ్యుండచ్చని శాస్ర్తవేత్తలు భావించారు. పాము పొడవు సుమారు 50 అడుగులు ఉండొచ్చని అంచనా వేశారు. అలాగే దాని బరువు సుమారు ఒక టన్ను అంటే ఏకంగా వెయ్యి కిలోలు ఉండొచ్చని లెక్కగట్టారు. ఆ పరిశోధనకు సంబంధించిన వివరాలు ‘స్ప్రింగర్ నేచర్’ లో సైంటిఫిక్ రిపోర్ట్స్ పేరిట గురువారం ప్రచురితం అయ్యాయి.