ఆయుర్వేద వైద్యాన్ని ఇంక బలోపేతం చేద్దాం

ఆయుర్వేద వైద్యాన్ని ఇంక బలోపేతం చేద్దాం

బీపీ,షుగర్ తోటే ప్రాణాంతక సమస్యలు వస్తున్నాయి
పల్లె దావకానల్లో ప్రజల బీపీ,షుగర్ చెకప్ చేయండి
రాష్ట్రాన్ని హెల్త్ హాబుగా మారుస్తాం
పనిచేసే ప్రభుత్వానికి మీ తోడ్పాటు అందించండి 
రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పిలుపు

ముద్ర ప్రతినిధి : సిద్దిపేట:  అతి ప్రాచీనమైన ఆయుర్వేద వైద్యాన్ని బలోపేతం చేసేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటానని రాష్ట్ర ఆర్థిక,ఆరోగ్య, వైద్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని పోలీస్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం జరిగిన విశ్వ ఆయుర్వేద పరిషత్ నిర్వహించిన కృతజ్ఞత సభలో మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి ఈ సభకు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యులు, పల్లె దావకానలలో కొత్తగా నియమితులై శిక్షణ పొందిన 1200 మంది ఆయుర్వేద వైద్య ఉద్యోగులు హాజరయ్యారు. ఇప్పటివరకు తెలంగాణలో 834 డిస్పెన్సరీలు, ఐదు కాలేజీలు, నాలుగు రీసెర్చ్ సెంటర్లు ఆయుర్వేద విభాగంలో ఉన్నాయని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఒకప్పుడు ఆయుర్వేదానికి ఘన చరిత్ర ఉండేదని మధ్యలో కాస్త కనుమరుగైన ప్రస్తుతం తాము మళ్లీ ఆయుర్వేద వైద్య రంగానికి జీవం పోస్తున్నామని తెలిపారు. ఆయుర్వేద ఆసుపత్రుల్లో తగినంతమంది ఉద్యోగుల నియామకంతో పాటు అవసరమైనంత మేర మెడిసిన్ ఇచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని హరీష్ రావు చెప్పారు. ఆయుర్వేద ఉద్యోగుల డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. 1987, 2006, 2011 సంవత్సరాలలో ఆయుర్వేద విభాగంలో కేవలం 400 మందిని మాత్రమే రిక్రూట్ చేయగా తాము ఒకేసారి 1200 మందిని నియమించామని మంత్రి వెల్లడించారు. ఆయుర్వేద వైద్యానికి ఉన్న గొప్పతనం కరోనా సమయంలో అందరికీ తెలిసిందన్నారు. 

ఆయుర్వేద శాఖ కరోనా కోసం తయారుచేసిన జీవనధార మందును ముఖ్యమంత్రితో పాటు తాను కిందిస్థాయి ఉద్యోగులు వాడామని చెప్పారు.రాష్ట్రంలో నాన్ వెజ్ వాడకం పెరిగిపోవడం వల్ల బీపీ,షుగర్లు యుక్త వయసులోనే ప్రజలకు మొదలవుతున్నాయని, అందువల్ల గ్రామీణ ప్రాంతాల్లోని వైద్యులు ప్రతి రోగికి బీపీ,షుగర్ చెక్ చేసి సమస్య ఉంటే మందులు అందివ్వాలని ఆదేశించారు. తద్వారా ప్రాణాంతక సమస్యలను వారు ఎదుర్కోకుండా సహకరించిన వారవుతారని డాక్టర్లకు సూచించారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న తమకు వైద్య ఉద్యోగులు, ఆయుర్వేద ఉద్యోగులు అండగా నిలవాలని, పల్లెల్లో తమ సేవలను ప్రజలకు గుర్తు చేయాలని మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా విశ్వ ఆయుర్వేద పరిషత్తు ద్వారా ఆయుర్వేద వైద్యులు మంత్రిని గజమాలతో సత్కరించారు. శాలువాలు కప్పి సన్మానం చేశారు. 

సభలో రాష్ట్ర ఆయుర్వేద వైద్య కళాశాల డైరెక్టర్ కే అనసూయ, విశ్వ ఆయుర్వేద పరిషత్తు వర్కింగ్ ప్రెసిడెంట్ వై శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు గుర్రం శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి బి కిషన్, ఎర్రగడ్డ ఆయుర్వేద హాస్పిటల్ సూపర్నెంట్ జి రామచంద్రారెడ్డి, వరంగల్ ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్ సూపర్నెంట్ జగన్మోహన చారి, జాతీయ కౌన్సిల్ సభ్యుడు సమ్మిరెడ్డి, రాష్ట్ర బోర్డు మెంబర్ హరి రమాదేవి ,ఎన్ దీపాంజలి, మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు కే అశోక్ కుమార్, టి జీవో ఆయుష్ ఫోరం అధ్యక్షుడు బి ప్రభాకర్, మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకుడు ఉమామహేశ్వరరావు, ఆర్.బి ఎస్ కే గౌరవ అధ్యక్షుడు బి మోహన్ రావు, రాష్ట్ర అధ్యక్షుడు గుండ రవీందర్, ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్, ఎన్ఆర్హెచ్ఎం ప్రతినిధులు జగదీశ్వర్ ప్రసాద్, రాము, పల్లె దావకాన ప్రతినిధులు కరుణాకర్,అరుణ తదితరులు పాల్గొన్నారు.