భువనగిరి కోట రూపురేఖలు మారుతాయ్...

భువనగిరి కోట రూపురేఖలు మారుతాయ్...
  • దశాబ్దపు కల నెరవేరబోతుంది : ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి భువనగిరి :భువనగిరి కోట రూపురేఖలు మారుతాయని, దశాబ్దపు కల నెరవేరబోతుందని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు.గురువారం కలెక్టరేటు సమావేశ మందిరంలో కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ 2.0 కార్యక్రమం క్రింద భువనగిరి కోట మొదటి దశ అభివృద్ది పనులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భువనగిరి కోట అభివృద్ది పనులకు సంబంధించి దశాబ్దపు కల నెరవేరుతున్నదని, భువనగిరి కోట అభివృద్ధికి స్వదేశీ దర్శన్ 2.0 క్రింద కేంద్ర ప్రభుత్వం 118 కోట్లు కేటాయిస్తూ మొదటి దశ పనులకు గాను 69 కోట్లు మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. వీటిలో రోప్ వే, రోడ్లు, పార్కింగ్ వసతులు, ప్ర్రారంభ ద్వారం, పర్యాటకులకు వసతులు, హరితవనాలు, విశ్రాంతి భవనాలు, సౌండ్ లైటింగ్, సాంకేతిక అభివృద్ధి తదితర పనులు ఉన్నాయని చెప్పారు. భువనగిరి పట్టణం హైదరాబాదుకు దగ్గరగా ఉన్నందున అభివృద్ది పనులు ఎక్కువ చేయాల్సి ఉంటుందని తెలిపారు. భువనగిరికి బస్వాపూర్ 6 కిమోటర్ల దూరంలోనే ఉందని, అది కూడా పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చేయడం జరుగుతుందన్నారు. అలాగే పోచంపల్లి ప్రపంచ హెరిటేజ్ విలేజ్ గుర్తించబడిందని, దీనిని కూడా సాధ్యమైనంత ఎక్కువ అభివృద్ది పరచి పర్యాటకులను ఆకర్శించడం జరుగుతుందని తెలిపారు. బీబీనగర్ మండలంలోని మహదేవ్ పూర్ దేవాలయం కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ పథకం క్రింద చేపట్టి అభివృద్ధి చేయాల్సి ఉందని, సంబంధిత మంత్రిత్వశాఖతో మాట్లాడడం జరిగిందన్నారు.

జిల్లా కలెక్టరు హనుమంతు కే.జెండగే మాట్లాడుతూ స్వదేశీ దర్శన్ 2.0 పథకం క్రింద దేశంలో 53 పనులకు ఈరోజు వర్చువల్ విధానంలో ప్రధానమంత్రి ప్రారంభించారని, ఇందులో భువనగిరి కోట అభివృద్ధి పనులు కూడా ఉన్నాయని అన్నారు. అందులో భాగంగా భువనగిరి కోట మొదటి దశ అభివృద్ది పనులను, ఏమేమి వసతులు కల్పించబడతాయో పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చూపించడం జరిగిందని, అలాగే జిల్లాలో యాదగిరిగుట్ట, కొలనుపాక, పోచంపల్లి తదితర పర్యాటక కేంద్రాలు అభివృద్ధి చెందుతూ దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతాలుగా గుర్తింపు పొందుతాయని, యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, భువనగిరి రెవిన్యూ డివిజనల్ అధికారి అమరేందర్, జడ్పిటిసి బీరుమల్లయ్య, అనూరాధ, మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథ, కేంద్ర ప్రభుత్వ టూరిజం అసిస్టెంట్ డైరెక్టరు మౌతోశ్ నాస్కర్, రాష్ట్ర టూరిజం జనరల్ మేనేజరు ఎం.ఉపేందర్ రెడ్డి, డిప్యూటీ జనరల్ మేనేజరు నేత్ర, జిల్లా టూరిజం అధికారి ధనంజనేయులు, జిల్లా అధికారులు, హెరిటేజ్ సిబ్బంది కమిటీ సభ్యులు వెంకటరెడ్డి, అంజయ్య, పర్యాటకులు, యువత పాల్గొన్నారు.