నిర్వహణా లోపం... నీరుగారుతున్న లక్ష్యం

నిర్వహణా లోపం... నీరుగారుతున్న లక్ష్యం
  • ఓపెన్ జిమ్ లలో యంత్రాల మరమ్మతులు చేసేదెవరు?
  • పట్టించుకోని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు

ముద్ర ప్రతినిధి, బోడుప్పల్ : అయిదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్స్ అవి.. బోడుప్పల్ మున్సిపల్ పరిదిలో రెండు చోట్ల ఉన్నాయి. ఒకటి సాయినగర్లో వుంటే, మరొకటి ఎన్టీఆర్ సర్కిల్ నుంచి లక్ష్మీనగర్ పార్కుకు వెళ్లే దారిలో వుంది. ఈ ఓపెన్ జిమ్ లు ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా వీటి మరమ్మతులకు పైసా ఖర్చు చేయలేదన్నది వాస్తవం. మరి వీటి మరమ్మతులకంటూ కేటాయిస్తున్న నిధులు ఏమవుతున్నాయో దీన్ని పర్యవేక్షించే అధికారులకే తెలియాలి.

ప్రజల ఆరోగ్య సంరక్షణలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ ఎంసీ) ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అయితే, వాటి నిర్వహణ విషయంలో మున్సిపల్ అధికారులు చేతులెత్తేయడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా రెండు చోట్ల ఓపెన్ జిమ్స్ నడుస్తున్నాయి. అయితే, బోడుప్పల్ ఎన్టీఆర్ సర్కిల్ నుంచి లక్ష్మీనగర్ పార్కుకు వెళ్లే దారిలో మీ సేవ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ నిత్యం మరమ్మతులకు గురవుతూ స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రతి రోజు ఉదయం సాయంత్రం వేళల్లో ఈ ప్రాంతీయులు సుమారు 500 మంది ఈ ఓపెన్ జిమ్ వినియోగించుకుంటున్నారు. ఈ ఓపెన్ జిమ్‌లో అబ్డామినల్ రైడర్, క్రాస్ వాకర్, సీట్ ట్విస్టర్‌లు, పుల్ కుర్చీలు, వర్టికల్ షోల్డర్ పుల్, లెగ్ ఎక్స్‌టెన్షన్, ఛాతీ పుషర్స్, ఎయిర్ వాకర్ మెషిన్, షోల్డర్ ట్విస్టర్లు మరియు వృత్తాకార స్వింగ్‌లతో సహా అనేక వ్యాయామ యంత్రాలు ఉంటాయి. 

వీటిని ఏర్పాటు చేసిన కొత్తలో చాలా బాగా పనిచేశాయి. కొంతకాలం తర్వాత అవి మరమ్మతులకు గురికావడంతో కొన్ని వ్యాయామ యంత్రాలు పనిచేయకుండా పోయాయి. దీంతో ఇక్కడ నిత్యం వ్యాయామం చేసే కొందరు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తలా కొంత మొత్తం వేసుకుని ఈ యంత్రాల బేరింగ్ లు బాగు చేయించేవారు. సింగరేణిలో పనిచేసి పదవీ విరమణ చేసిన కె.సదానందం, ఉస్మానియా విశ్వవిద్యాలయం జియాలజీ విభాగంలో పనిచేసి రిటైర్ అయిన రామిరెడ్డి, రిటైర్డ్ బ్యాంక్ అధికారి రామచంద్ర, మరో రిటైర్డ్ ఉద్యోగి డి.పద్మారావుతో కలిసి ఒక కమిటీగా ఏర్పడ్డారు. ప్రతి నెల కొంత మొత్తం వేసుకుని చెడిపోయిన యంత్రాలను మరమ్మతులు చేయించుకుంటున్నారు. అయితే, ఈ యంత్రాలు పాతబడటం, ఏళ్ల క్రితం ఏర్పాటు చేసినవి కావడంతో తరచూ చెడిపోతున్నాయి. వీటి మరమ్మతులు తమకు తలకుమించిన భారమవుతోందని పద్మారావు ముద్ర ప్రతినిధితో తెలిపారు. ఇటీవలే ఈ ప్రాంత కార్పొరేటర్ ను కలిసి ఒక వినతి పత్రం సమర్పించామని వివరించారు. 

బోడుప్పల్ నగర పాలక సంస్థలో ఈ ప్రాంతానికి ప్రాతినిథ్యం వహిస్తున్న కార్పొరేటర్ సామల పవన్ రెడ్డి తో ఈ విషయమై మాట్లాడినపుడు ఈ వ్యాయామశాలల నిర్వహణ విషయంలో కార్పొరేషన్ అధికారుల తీరు పట్ల పెదవి విరిచారు. తాము ఎన్నిక కాకముందు నుంచే ఈ ఓపెన్ జిమ్ లు ఉన్నాయని, ఇంతవరకు ఈ ప్రాంతంలోని ప్రజలే వీటిని నిర్వహించుకుంటున్నారని ఆయన తెలిపారు. పలుమార్లు కౌన్సిల్ సమావేశాల్లో వీటి మరమ్మతుల విషయమై చర్చించానని అన్నారు. ఇటీవలే ఈ ఓపెన్ జిమ్ లకు సంబంధించి కొంత మేరకు నిధులు మంజూరయ్యాయని,  త్వరలో వీటిని బాగు చేయిస్తామని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ తో పాటు ఇంజినీరింగ్ అధికారులు దీన్ని ప్రాధాన్యాంశంగా పరిగణించి ఈ ప్రాంత వాకర్స్ విరివిగా వినియోగించే ఈ ఓపెన్ జిమ్ లను బాగు చేయించాలని ఆయన కోరారు.