పద్మశాలి కార్పోరేషన్ ఏర్పాటు హర్షనీయం

పద్మశాలి కార్పోరేషన్ ఏర్పాటు హర్షనీయం
  • అఖిల భారత పద్మశాలి సంఘం రాష్ట్ర సెక్రటరీ వెల్ది కవిత

ముద్ర పెద్దపల్లి, ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షనీయమని అఖిల భారత పద్మశాలి సంఘం తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ వెల్ది కవిత అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటులో పద్మశాలీలకు సముచిత గౌరవం ఇవ్వడం శుభపరిణామమని ఆమె పేర్కొన్నారు.  పద్మశాలీల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూర దృష్టితో ఆలోచించి పద్మశాలీలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల సీఎంతో పాటు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

ఆర్థికంగా వెనుకబడిన పద్మశాలి మహిళలకు కార్పొరేషన్ ద్వారా ఆర్థిక ప్రగతి సాధించేందుకు సంఘం తరపున కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎన్నో ప్రభుత్వాలు పద్మశాలీలను కేవలం ఓటు బ్యాంకు గా మాత్రమే పరిగణలోకి తీసుకున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తొలిసారిగా పద్మశాలీల ఆత్మ గౌరవం నిలబెట్టేలా ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం శుభ సూచికమని అన్నారు. పద్మశాలీల మహిళలను ఆర్థికంగా ప్రోత్సహిస్తూ స్వయం సహాయక సంఘాలుగా ఒకటై వీలైనంత త్వరగా కార్పొరేషన్ ద్వారా రుణాలను సమకూర్చాలని కోరారు. ఇందుకు అఖిలభారత పద్మశాలి సంఘం తరఫున పద్మశాలి మహిళల ఆర్థిక ప్రగతి కోసం ముందుంటామని హామీ ఇచ్చారు. పద్మశాలిల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని పేర్కొన్నారు.