నన్ను కాల్చండి అంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకున్న కార్యకర్త

నన్ను కాల్చండి అంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకున్న కార్యకర్త
  • ఎమ్మెల్యే ముందు మండల పార్టీ అధ్యక్షులు ఆత్మహత్యాయత్నం
  • వ్యతిరేక వర్గీయులను పార్టీలో చేర్చుకోవద్దని డిమాండ్ 
  • ఎమ్మెల్యే ఇంటిముందు ఉద్రిక్తత

ముద్ర ప్రతినిధి, వనపర్తి: తనను కాల్చి చంపి తన వ్యతిరేక వర్గీయులను పార్టీలో చేర్చుకోండి అంటూ గురువారం వనపర్తి ఎమ్మెల్యే ముందు మండల పార్టీ అధ్యక్షులు గుండ్రాతి గణేష్ గౌడ్ ఒంటిపై కిరోసిన్ పోసుకొని అగ్గిపెట్టెను ఎమ్మెల్యేకు అందించారు. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన కొంతమంది బి ఆర్ ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నట్లు తెలియడంతో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, ఆ గ్రామ మాజీ సర్పంచ్ గుండ్రాతి గణేష్ గౌడ్ తన అనుచరులతో ఎమ్మెల్యేను కలిసి గ్రామ టిఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని, టిఆర్ఎస్ అధికారంలో ఉండగా తనపై అనేక తప్పుడు కేసులు పెట్టారని అలాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయని, తాను న్యాయం చేయలేనని ఎమ్మెల్యే కు వివరించారు. అయినప్పటికీ సానుకూల స్పందన రాకపోవడంతో ఆవేదన చెందిన గణేష్ గౌడ్ తాను మండల పార్టీ అధ్యక్షుని అయినప్పటికీ తాను వద్దన్నా ఎలా చేర్చుకుంటారని, వెంట తెచ్చుకున్న కిరోసిన్ ఒంటిపై పోసుకొని అగ్గిపెట్టెను ఎమ్మెల్యేకు అందజేసి ముందు తనను కాల్చండి తర్వాత వారిని చేర్చుకోండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న పోలీసులు కార్యకర్తలు వారించి అతని అక్కడి నుంచి పంపించారు. దీంతో ఎమ్మెల్యే ఇంటి వద్ద ముద్రిక వాతావరణం నెలకొంది.