జిల్లాలో భారీగా రైల్వే కేబుల్ వైర్ల చోరీ...

జిల్లాలో భారీగా రైల్వే కేబుల్ వైర్ల చోరీ...
  • మల్యాల వద్ద 20 లక్షల విలువ చేసే వైరు దొంగతనం..!
  • ముఠాను పట్టుకున్న పోలీసులు.. 6 లక్షల విలువ చేసే వైరు రికవరీ...

ముద్ర, మల్యాల:రైల్వే స్టేషన్లలో సిగ్నల్ కోసం ఏర్పాటు చేసే కేబుల్ (కాపర్) వైరు భారీగా చోరీకి గురవుతోంది. ఇటీవల మల్యాల క్రాస్ రోడ్డు సమీపంలోని రైల్వే స్టేషన్ వద్ద ఉన్న (10 నుంచి 20 లక్షల విలువ) కేబుల్ వైరు గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించడంతో రైల్వే పోలీసులు (ఆర్పీఎఫ్ సిబ్బంది ) తనిఖీలు చేపట్టారు. పలు సీసీ పుటేజ్ లు కూడా పరిశీలించడంతో పాటు, స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. అయితే ఈ నెల 7 న అర్ధరాత్రి  రైల్వే పోలీసులు (ఆర్పీఎఫ్ ఎస్ఐ ఆధ్వర్యంలో) తనిఖీలు చేస్తున్న క్రమంలో  మల్యాల-నూకపల్లి మధ్య ట్రాక్ పై కొందరు వ్యక్తులు వైరు దొంగిలిస్తూ కనిపించారు. అయితే వారిని పట్టుకునే ప్రయత్నంలో పోలీసులపై రాళ్లు రువ్వి పారిపోయారు. వెంటనే రైల్వే పోలీసులు100 డయాల్ కి కాల్ చేసి సమాచారం ఇవ్వడంతోనే మల్యాల పోలీస్ స్టేషన్ బ్లూకోల్ట్స్ సిబ్బంది రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. రాజారo వైపు వెళ్తున్న ఎనిమిది మంది వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకోని విచారించగా, దొంగతనానికి పాల్పడినట్లు నిర్దారణ అయింది. దీoతో దొంగలను రైల్వే పోలీసులకు అప్పగించారు. దొంగతనంకు పాల్పడిన ఎనిమిది మంది ఏన్టీపీసీ, రామగుండం ప్రాంతంకు చెందినవారని ఆర్పీఎఫ్ ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. కాగా, ఒకే వారం వ్యవదిలో ఇక్కడ రెండు సార్లు దొంగతనం జరిగిందని, ప్రస్తుతం  5 నుంచి 6 లక్షల విలువ గల కేబుల్ వైర్ రికవరీ చేసుకున్నట్లు ఎస్ ఐ పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా, రైల్వే పోలీసులు సంఘటన జరిగినప్పుడే కాకుండా, ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని, ఇటీవల జరిగిన రైలు ప్రమాదం దృష్టిలో పెట్టుకొని, స్టేషన్ లపై, ట్రాక్ లపై ప్రత్యేక నిఘా పెట్టాలని పలువురు కోరుతున్నారు.