ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి  

ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి  

ముద్ర ప్రతినిధి, మెదక్:ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని మెదక్ పట్టణంలోని తపాలా కార్యాలయం చౌరస్తా నుంచి  ర్యాలీగా వెళ్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడించారు. అనంతరం  వినతి పత్రం అందజేశారు. సీఐటీయూ మెదక్ జిల్లా కార్యదర్శి  బి. బస్వారాజ్ మాట్లాడుతూ... గత తొమ్మిది రోజులుగా ఆశా వర్కర్లు శాంతియుతంగా సమ్మె చేస్తున్నా, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. గౌరవ వేతనంగా పారితోషికాలు కాకుండా, కనీస వేతనం 18 వేలు నిర్ణయించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మేమేమీ గొంతెమ్మ కోరికలు అడగడం లేదు.  రాష్ట్ర  ప్రభుత్వం 10 వేలు ఇస్తున్నామని గొప్పలు చెబుతున్నది.. కానీ, మెదక్ జిల్లాలో ఎక్కడ  ఆశా వర్కర్లకు 10 వేల వేతనం ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. రూ. 9750 ఇస్తూ చేతులు దులుపుకుంటుందన్నారు.  ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలన్నారు.  ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ల యూనియన్ జిల్లా కార్యదర్శి సావిత్రి, నాయకురాలు స్వప్న, మంజుల, పద్మ, రాణి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.