మా సర్కార్ వస్తుంది

మా సర్కార్ వస్తుంది
  • యేటా జాబ్ క్యాలెండర్ ఇస్తాం
  • రాష్ట్రంలో ఖాళీలన్నీ భర్తీ చేస్తాం
  • టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో కేటీఆర్ హస్తం
  • మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయాలి
  • కేసీఆర్ కు అంబేద్కర్ విగ్రహాన్ని ముట్టుకునే అర్హత లేదు
  • నిరుద్యోగ మార్చ్ లో బీజేపీ చీఫ్ బండి సంజయ్

ముద్ర ప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. తమ  ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యేటా జాబ్ కాలెండర్ ను రిలీజ్ చేస్తామన్నారు. రాష్ట్రంలో ఖాళీలన్నీ భర్తీ చేస్తామన్నారు. హనుమకొండ అంబేడ్కర్ సెంటర్ లో శనివారం సాయంత్రం నిర్వహించిన ‘నిరుద్యోగ మార్చ్‌’లో  ఆయన మాట్లాడారు. తెలంగాణలో ఏ పరీక్ష నిర్వహించినా తప్పుల తడకేనని విమర్శించారు. నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు. కేసీఆర్ 30 లక్షల మంది యువత భవిష్యత్ ను పాడు చేశారని ఆరోపించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయితే కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదని అన్నారు. ఇందులో మంత్రి కేటీఆర్‌ హస్తం ఉందని, వెంటనే ఆయనను మంత్రి పదవి నుంచి భర్తరఫ్‌ చేయాలని డిమాండ్ చేసారు. లిక్కర్ స్కామ్ లో బిడ్డ దొరికితే చర్యలు తీసుకోరని, పేపర్ లీకేజీలో కేటీఆర్ హస్తం ఉన్నా ఏమీ అనరని అన్నారు. దళిత మంత్రి రాజయ్యను మాత్రం ఏ తప్పు చేయకున్నా పదవి నుంచి తీసివేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కేసీఆర్ ఇంటి నుంచే దందాలు
రాష్ట్రంలో అన్ని పేపర్ల లీకులకూ బండి సంజేయే కారణమని చెబుతున్నారని మండిపడ్డారు. ప్రజల సమక్షంలో సమాధానం చెప్పక తప్పదని పేర్కొన్నారు. ఇంట్లో కార్యక్రమం ఉందని చెప్పినా అరెస్ట్ చేశారన్నారు. కేసిఆర్ ఇంట్లోవారంతా దందాలు చేస్తున్నారని ఆరోపించారు. టీఎస్పీఎస్సీ లో తప్పులు లేకుంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తప్పులు లేకపోయిన ఈటలను బయటకు పంపారని గుర్తు చేశారు. విద్యార్థులు, యువత భవిష్యత్తు కోసం బీజేపీ  పోరాడుతోందన్నారు. ఈడీ విచారణ అంటే చాలు కేసీఆర్ అనేక సాకులు చెబుతున్నారని సంజయ్ ఎద్దేవా చేశారు. 30 లక్షల మంది యువత ఇబ్బందిపడితే ప్రగతి భవన్ నుంచి బయటకు రారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు, ఇంటర్ విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నా స్పందించరని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎన్నో బాధలు పడి హైదరాబాద్ వస్తారని కానీ కేసీఆర్ ఉద్యోగాల పేరుతో  యువతను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సీటీల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. యువత చదువుకుంటే ప్రశ్నిస్తారని ఉద్యోగాలు అడుగుతారని అందుకే వర్సిటీలను నిర్వీర్యం చేశారన్నారు.

రాజ్యాంగాన్ని అవమానించారు
సీఎం కేసీఆర్కు అంబేద్కర్ విగ్రహాన్ని ముట్టుకునే అర్హత లేదని బండి సంజయ్ విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానించారని మండిపడ్డారు. ఒక్కసారి కూడా కేసీఆర్ అంబేద్కర్ వర్థంతి, జయంతికి హాజరు కాలేదని ఆయన గుర్తు చేశారు. త్వరలో ఎన్నికలు వస్తున్నాయనే కారణంగా హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని విమర్శించారు. 21న పాలమూరు గడ్డపై నిరుద్యోగ మార్చ్‌తో పాటు పది ఉమ్మడి జిల్లాల్లో నిరుద్యోగ మార్చ్, తర్వాత హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్ జరుపుతామని తెలిపారు. సీఎం కేసీఆర్ పెట్టిన సిట్‌లు ఏ కేసునూ తేల్చలేదని దుయ్యబట్టారు. కుట్రతో తమపై టెన్త్ పేపర్‌ లీక్ ఆరోపణ చేశారని మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్ తో కాకుండా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మళ్లీ ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు రావు పద్మ, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, సీనియర్ నాయకులు గరికపాటి మోహన్ రావు, చాడ సురేష్ రెడ్డి, ధర్మారావు , రాకేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భారీగా కదిలిన నిరుద్యోగులు
నిరుద్యోగ మార్చ్ కు నిరుద్యోగులు భారీ సంఖ్యలో వచ్చారు . టీఎస్పీఎస్సీ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, అభ్యర్థులకు లక్ష రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను మంత్రివర్గం నుంచి బర్తరాఫ్ చేయాలని, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలంటూ కేయూ జంక్షన్ నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీని నిర్వహించారు . ర్యాలీ పొడుగునా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉదయం బీఆర్ఎస్ కార్యకర్తలు కేయూ వద్ద ప్లెక్సీలను చించి వేసి, మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు బందోబస్తును కట్టుదిట్టం చేశారు. ర్యాలీ సాగే రెండు కిలోమీటర్ల పొడవునా దాదాపు వెయ్యి మంది పోలీసులను మోహరించారు. ర్యాలీకి వచ్చే వారిని భయపెట్టేందుకు పోలీసులు హడావుడి చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు.

కేయూ వ‌ద్ద తీవ్ర ఉద్రిక్తత
హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీలో శనివారం తీవ ఉద్రిక్తతత చోటుచేసుకుంది. బీజేపీ నిరుద్యోగ మార్చ్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్వీ నేతలు ఫస్ట్ గేటు వద్ద నిరసన చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహ‌నం చేశారు. బీజేపీ ఫ్లెక్సీలను దగ్ధం చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో దీంతో పోలీసులకు, నేతలకు మధ్య వాగ్వాదం నెలకొంది. కేంద్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని బీఆర్ఎస్వీ నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగ మార్చ్ నిర్వహించే హక్కు లేదని, నిరుద్యోగ మార్చ్ అడ్డుకుంటామని హెచ్చరించారు. దీంతో 11 మంది నిరసనకారులను పోలీసులు ఆరెస్ట్ చేసి ధ‌ర్మసాగ‌ర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాకతీయ యూనివర్సిటీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.