'రక్త'దారి..

- ఆటోను ఢీ కొట్టిన లారీ
- అక్కడికక్కడే ఐదుగురు మృతి
- మరో ఇద్దరికి గాయాలు
- లారీ డ్రైవర్ మద్యం
- మత్తుతోనే దుర్ఘటన
ముద్ర ప్రతినిధి, వరంగల్: వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో బుధవారం ఉదయం తెల్లవారుజామున ఆటోను లారీ ఢీ కొట్టింది. ఫలితంగా అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా.. ఎంజీఎం ఆసుపత్రికి తరలిస్తుండగా మరో చిన్నారి ప్రాణాలు వదిలాడు. ఆటోలో మొత్తం ఏడుగురు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది.
నలుగురు అక్కడికక్కడే..
ఊరు ఊరు జీవనం సాగించే వ్యాపారస్తులు తొర్రూర్ నుంచి బుధవారం ఉదయం తెల్లవారుజామున వరంగల్ కు ఆటోలో బయలుదేరారు. రాజస్థాన్ కు చెందిన లారీ వరంగల్ నుంచి తొర్రూరు వైపు వెళ్తోంది. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చేరుకున్నారు. అప్పటికే లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండగా.. ఎదురుగా వస్తున్న ఆటోను గమనించలేక బలంగా ఢీకొట్టాడు. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ ఢీకొన్న దాటికి ఆటో కాగా అందులోని బాలుడు ఎగిరి పడగా.. మిగతావారు ఎక్కడికక్కడ కుక్కినట్లుగా మృతదేహాలు దర్శనమిస్తున్నాయి. శవాల నుంచి వెలువడ రక్తం రోడ్డుపై చిమ్మడంతో రహదారి మొత్తం కూడా రక్తం రంగును పులుముకున్నట్టు కనిపిస్తుంది. పరిస్థితిని చూస్తే భయానకంగా దర్శనమిస్తోంది.
ఎంజీఎం కు తరలింపు..
రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి పోలీసులకు సమాచారం అందించడంతోపాటు.. మృతదేహాలను బయటకు తీశారు. అప్పటికే తీవ్ర గాయాల పాలైన గగన్ (15)ను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతదేహాలను, క్షతగాత్రులను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.