ఫుట్బాల్ టోర్నమెంట్ వనపర్తి లో నిర్వహించడం అభినందనీయం - మంత్రి నిరంజన్ రెడ్డి

ఫుట్బాల్ టోర్నమెంట్ వనపర్తి లో నిర్వహించడం అభినందనీయం - మంత్రి నిరంజన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, వనపర్తి : ఫుట్ బాల్ అసోసియేషన్ ద్వారా అంతర్ జిల్లా ఫుట్ బాల్ టోర్నమెంట్ ను వనపర్తి జిల్లాలో నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ అన్నారు.  ఆగస్టు, 16 నుండి 18 వరకు వనపర్తి జిల్లా  పెబ్బేరు మండలంలోని పి.జే.పి క్రీడా మైదానంలో అంతర్ జిల్లా స్థాయి ఫుట్ బాల్ టోర్నమెంట్ నిర్వహించగా  బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తో కలిసి క్రీడలను ప్రారంభోత్సవం చేశారు.  

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు. ప్రతి క్రీడాకారునిలో  ప్రత్యేక ప్రతిభ ఉంటుందని, సాటి క్రీడాకారుని లో ఉన్న ప్రతిభను గుర్తించి వారితో పోటీపడి ప్రతిభను నేర్చుకోవాలి తప్ప తక్కువ చేసి చూడవద్దని దీనినే క్రీడా స్ఫూర్తి అంటారు అని వివరించారు.  వనపర్తి జిల్లా చాలా ప్రత్యేకత కలిగిందని,  రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులను అందించిన జిల్లా వనపర్తి అని తెలిపారు. ఇక్కడ ఉన్న ప్రత్యేకతలను తెలుసు కోవాలని, జూరాల, రంగాపుర్, బీచ్ పల్లి వంటి ప్రాంతాలను సందర్శించాలని తెలిపారు.  

ఈ ప్రాంతం చిరకాలంగా మీ మదిలో గుర్తుండిపోవాలని చెప్పారు. ఆటల ద్వారా తమ నైపుణ్యాన్ని మెరుగు  పరుచుకోవాలని సూచించారు. గెలుపు ఓటములు సహజమని, గెలిచిన వారు ఓడిన వాళ్ళను వారు పోరాడిన తీరును మెచ్చుకోవాలి సూచించారు.  మరడొన, మెస్సీ, రోనాల్డో వంటి అంతర్జాతీయ ఫుట్ బాల్ క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో క్రీడా సంస్కృతి సాంప్ర దాయాలను పాటిస్తున్నందుకు ఫుట్ బాల్ అసోసియేషన్ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు.  

క్రమశిక్షణతో ఆటలు ఆడితే నైపుణ్యం, సామర్థ్యం  పెరుగుతుందని తెలిపారు. ఏ ప్రాంతంలో వెళ్లి టోర్నమెంట్ లో పాల్గొన్నా కొన్ని జ్ఞాపకాలు ఉండిపోతాయని,  వనపర్తి జిల్లా నుండి అందరూ తీపి జ్ఞాపకాలతో వెళ్లాలని ఆకాంక్షించారు. ఇక్కడి వంటకాలు చాలా బాగుంటాయని అదేవిధంగా చూడవలసిన ప్రాంతాలు సైతం ఉన్నాయని తెలియజేశారు. క్రీడాకారులు ఆటలు ఆడేటప్పుడు వారి మొహంలో ఒక చైతన్యం, ఉత్తేజం ఉంటుందని అది జీవితంలో ఒక చుక్కాని వలె పని చేస్తుందని తెలిపారు. భారత దేశంలో సైతం పేరుగాంచిన గొప్ప  ఫుట్ బాల్ క్రీడాకారులు ఉన్నారని అందులో సునీల్ చత్రి ఒకరని తెలిపారు. అతన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ కరుణశ్రీ, మున్సిపల్ కమిషనర్ ఆదిశేషు,  వైస్ చైర్మన్ కర్రే స్వామి,  జిల్లా క్రీడా శాఖల అధికారి సుధీర్ రెడ్డి, తహశీల్దార్ లక్ష్మి, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.