పైపులైన్ల తో పాడైపోతున్న బీటీ రోడ్లు

పైపులైన్ల తో పాడైపోతున్న బీటీ రోడ్లు
  • పట్టించుకుని అధికారులు పోలీసులు

ముద్ర.వీపనగండ్ల:- బీటీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తయి ఆరు నెలల గడవకముందే కొందరు రైతులు పంట పొలాలకు పైపులైన్లను తీసుకు వెళ్ళటానికి బీటీ రోడ్లను అడ్డంగా తవ్వుతూ పాడు చేస్తున్న అధికారులు పోలీసులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని వాహనదారులు ప్రయాణికులు వాపోతున్నారు. అంతేకాక కేజీ వీల్స్ తో ట్రాక్టర్లు వెళుతుండటంతో బీటి రోడ్డు కోతకు గురై వాహనాల రాకపోకలకు ఇబ్బందులుగా మారుతున్నాయి. మండల కేంద్రమైన వీపనగండ్ల నుంచి గోవర్ధనగిరి వరకు ఇటీవలే బీటీ రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేశారు. బిటి రోడ్డు పై కేజీ వీల్స్ తో ట్రాక్టర్లు వెళ్ళరాదని, రోడ్డుకు అడ్డంగా పైపులైన్ల కోసం తవ్వరాదని పలుమార్లు పోలీసులు అధికారులు హెచ్చరిస్తున్న అవేమి తమకు పట్టనట్లుగా ట్రాక్టర్ యజమానులు రైతులు వివరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

గత రెండు రోజుల క్రితం గోవర్ధనగిరి నుంచి వీపనగండ్లకు వచ్చే బీటీ రోడ్డుపై గోవర్ధనగిరి సమీపంలో కొందరు రైతులు పైపులైన్ నిర్మాణం కోసం రోడ్డును అడ్డంగా తవ్వి పైపులైలను ఏర్పాటు చేసుకున్నారు. తవ్విన రోడ్డుపై పైప్లైన్ వేసిన తర్వాత వాటిని కప్పి వేయడంతో గోతులుగా ఏర్పడి వాహనాల రాకపోకలకు ఇబ్బందులుగా మారాయి. అంతేకాక వీపనగండ్ల--తూముకుంట, అమ్మాయిపల్లి-- వీపనగండ్ల రహదారిలో కూడా కొందరు రైతులు పైప్లైన్ల కోసం రోడ్లను తవ్వి నిర్లక్ష్యంగా వదిలేశారు. దీంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వాహనదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పోలీసులు చర్యలు తీసుకుని బీటీ రోడ్లపై కేజీ వీల్స్ తో ట్రాక్టర్లు వెళ్లకుండా, బీటీ రోడ్లు పాడు కాకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.