ఎన్నికల నిర్వహణకు పార్టీల నేతల సహకారం అవసరం-కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్

ఎన్నికల నిర్వహణకు పార్టీల నేతల సహకారం అవసరం-కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్

ముద్ర ప్రతినిధి,  వనపర్తి : రానున్న ఎన్నికలను  వనపర్తి జిల్లాలో సజావుగా విజయవంతంగా నిర్వహించేందుకు పొలిటికల్ పార్టీ ప్రతినిధుల సహకారం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు.  బుధవారం ఉదయం ఈ.వి.యం గోదాము పార్టీ ప్రతినిధుల సమక్షంలో నెలవారీ తనిఖీ చేసి అందులో ఎఫ్.ఎల్.సి సందర్భంగా డిఫెక్ట్ ఉన్నవిగా గుర్తించిన 17 బ్యాలెట్ యూనిట్లు, 3 కంట్రోల్ యూనిట్లు, 1 వివి ప్యాట్ ను మరమ్మతుల నిమిత్తం హైదరాబాద్ లోని ఈ.సి. ఐ. ఎల్ కు తరలించారు.  అనంతరం ఆర్డీవో కార్యాలయంలో పొలిటికల్ పార్టీ ప్రతినిధులతో ఎస్.ఎస్.ఆర్ ఎలక్టరల్ రోల్ జాబితా, నూతన ఓటర్ల నమోదు, పోలింగ్ స్టేషన్ల మార్పు, పార్టీ తరపున బూత్ లెవల్ ఏజెంట్ ల నియామకం పై సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్, 1 2023 నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకుంటున్న యువత ముందుగానే ఓటరు జాబితాలో పేరు నమోదుకు చేసుకోవాలని సూచించారు.  18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి యువతి యువకుడు తన పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకునే విధంగా బూత్ స్థాయిలో అవగాహన కల్పించాలని పార్టీ ప్రతినిధులను కోరారు.  ప్రస్తుతం 3547 దరఖాస్తులు వచ్చాయని వాటిని పరిశీలించడం జరుగుతుందన్నారు. తుది ఓటర్ జాబితా అక్టోబర్ 4వ తేదీన వెలువరించడం జరుగుతుందని తెలిపారు.   ఇంతకు ముందు వెలువరించిన ఓటరు జాబితాలో  ఒకే రకమైన  ఫోటో, ఓకే రకమైన పేరు, వివరాలు ఉన్న వారి పేర్లు సుమారు 15 వెలు గుర్తించడం జరిగిందన్నారు. అందులో నుండి పరిశీలన అనంతరం సుమారు 7 వేల వరకు తొలగించినట్లు తెలిపారు.  ప్రస్తుతం వనపర్తి జిల్లాలో 290 పోలింగ్ స్టేషన్లో 175 లొకేషన్ లలో ఉన్నాయని వాటిని మార్చేందుకు అవకాశం ఉన్నవాటి ప్రతిపాదనలు పంపించాలని తెలియజేశారు.  ఒకే చోట రెండు కన్నా ఎక్కువ పోలింగ్ బూతులు లేకుండా చూడాలని సూచించారు.

ఈసారి ఎన్నికలలో 80 సంవత్సరాల వయస్సు పైబడిన వారు, సదరం సర్టిఫికెట్ కలిగి ఉన్న దివ్యాంగులకు ఇంటినుండే ఓటు వేసే విధంగా ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించిందన్నారు దీని కొరకు వారు ఫారం 12-డి ద్వారా తన పేరు నమోదు చేయించుకోవాలని తెలియజేశారు. ఒకసారి 12 డి లో నమోదు చేసుకున్నాక ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి రానివ్వరు అనే విషయం గుర్తు పెట్టుకోవాలని తెలిపారు. ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని సూచించారు.  వనపర్తి జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన మేరకు ఈ.వి.యం లు ఉన్నాయని వాటిని ఇటీవలే  పార్టీ ప్రతినిధుల సమక్షంలో విజయవంతంగా మొదటి లెవల్ చెకింగ్  పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ.వి.యం ల పనితీరు, అవగాహన కల్పించేందుకు త్వరలోనే  బూత్ స్థాయి లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో పద్మావతి, ఎన్నికల సెక్షన్ సుపరిండెంట్ రమేష్ రెడ్డి, బి.జే.పి తరపున ఆర్. వేంకటేశ్వర రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరపున వేణా చారి, కొండా రెడ్డి, యం. ఐ.యం తరపున యం. ఏ రహీమ్, సి.పి.యం తరపున యం.డి. జబ్బార్, సి.పి. ఐ నుండి రమేష్, టి.డి.పి నుండి సయ్యద్ జమిలుల్లా తదితరులు పాల్గొన్నారు.