భూసేకరణ ప్ర‌క్రియ‌ను వేగవంతం చేయండి

భూసేకరణ ప్ర‌క్రియ‌ను వేగవంతం చేయండి
  • సచివాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులతో స‌మీక్ష‌

ముద్ర ప్రతినిధి,కొల్లాపూర్:-కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని వివిధ ప్రాజెక్ట్ ల నిమిత్తం భూసేక‌ర‌ణ ప‌నుల్లో వేగం పెంచాల‌ని, మైన‌ర్ ఇరిగేష‌న్ ప‌నులు త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేసేలా చ‌ర్యలు తీసుకోవాల‌ని రాష్ట్ర ఎక్సైజ్, ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌ మరియు పురావ‌స్తు శాఖ  మంత్రి వర్యులు శ్రీ. జూప‌ల్లి కృష్ణారావు  నీటిపారుద‌ల శాఖ అధికారుల‌ను ఆదేశించారు.  డా. బీఆర్. అంబేడ్క‌ర్ స‌చివాల‌యంలో మహాత్మా గాంధీ  కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలోని సింగోటం జలాశయం, జూరాల ఎడమ కాలువ పరిధిలోని గోపాల్ దిన్నె జలాశయాల్ని కలిపే లింకు కెనాల్ ప‌నుల పురోగ‌తి,  భూసేక‌ర‌ణ‌పై మంత్రి జూప‌ల్లి కృష్ఱారావు స‌మీక్ష నిర్వ‌హించారు.మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలోని సింగోటం జలాశయం నుంచి జూరాల పరిధిలోని గోపాలదిన్నె జలాశయం నింపడం ద్వారా దిగువ‌నున్న  35వేల ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంతో లింకు కెనాల్ పనులకు రూపకల్పన చేశారు.

అయితే న‌త్త‌న‌డ‌క‌న ప‌నులు కొన‌సాగుతుండ‌టంపై మంత్రి ఆరా తీశారు. భూసేకరణలో జాప్యం కారణంగా పనులు ఆలస్యం అవుతున్నట్లు అధికారులు మంత్రికి వివ‌రించారు.భూసేకరణ సమస్యలపై ఇప్పటికైనా నీటిపారుదల, రెవెన్యూ శాఖ‌ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, పరిహారం సంగతి తెలితే పనులు వేగం అందుకునే అవ‌కాశం ఉంద‌ని, ఆ దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని మంత్రి అధికారుల‌ను ఆదేశించారు.కెనాల్ నిర్మాణం వ‌ల్ల‌ భూములు కోల్పోతున్న వాళ్లంతా చిన్న సన్నకారు రైతులేనని, వారికి  స‌రియైన ప‌రిహారం అందించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు సూచించారు.  దీనికి సంబంధించి ప్ర‌తిపాద‌న‌ల‌ను వెంట‌నే రూపోందించి, నివేదిక‌ను స‌మ‌ర్పించాల‌ని చెప్పారు. రెవెన్యూ అధికారుల స‌మ‌న్వ‌యంతో ప‌ని చేసి త్వ‌రిత‌గ‌తిన భూసేక‌ర‌ణ ప్ర‌క్రియ  పూర్తి చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, దీనిపై తాను క‌లెక్టర్ తో కూడా మాట్లాడుతాన‌ని మంత్రి జూపల్లి తెలిపారు.సాధ్య‌మైనంత త్వ‌ర‌గా భూ సేక‌ర‌ణ ప్ర‌క్రియ‌ను పూర్తి చేసి కెనాల్ ప‌నులు చేప‌ట్టే విధంగా దృష్టి సారించాల‌న్నారు. ఈ ప‌నులు పూర్తైతే చివ‌రి ఆయ‌క‌ట్టు వ‌ర‌కు సాగు నీరందుతుంద‌ని పేర్కొన్నారు.1500 ఎక‌రాల ఆయ‌క‌ట్టుకు నీరందించే జిల్దార్ తిప్ప చెరువు ప‌నుల పురోగ‌తిపై మంత్రి ఆరా తీశారు.జిల్దార్ తిప్ప చెరువు నింప‌డానికి ప్యాకేజీ - 30తో పాటు బాచారం,  యాప‌ట్ల,  మారేడ్ మాన్ దిన్నె, జిల్దార్ తిప్ప‌  గ్రామాల ప‌రిధిలోని  ఆయ‌క‌ట్టుకు నీరందించే ప‌నుల‌కు సంబంధించి  ప్ర‌తిపాద‌న‌లు రూపోందించాల‌న్నారు. నీటి లభ్యత ఉన్న చోట చెరువుల ద్వారా పూర్తిస్థాయిలో డిస్టిబ్యూటర్ కింద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సాగునీరందించాలని పేర్కొన్నారు. ప్రధానంగా చెరువుల కింద ఎంత ఆయకట్టు ఉందో నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో వాస్తవ వివరాలు అందించాలని సూచించారు.ఈ స‌మీక్ష స‌మావేశంలో ఎస్.ఇ. విజ‌య భాస్క‌ర్ రెడ్డి, ఈఈ శ్రీనివాస్ రెడ్డి, సంజీవ్ రావులు పాల్గొన్నారు.