147 మంది బాలకార్మికులకు విముక్తి

147 మంది బాలకార్మికులకు విముక్తి
Liberation of 147 child laborer's Warangal Police Commissioner

వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్

ముద్ర, వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 147 మంది బాలకార్మికులకు విముక్తి కలిగించినట్లు పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలో బాల కార్మికుల వ్యవస్థను నిర్మూలనలో భాగంగా జనవరి 1 నుంచి 31 వరకు పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ స్మైల్ 9వ విడత నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా కమిషనరేట్ పరిధిలో పోలీసు, ఏహెన్టియూ (యాంటీ హ్యమన్ ట్రాఫికింగ్ యూనిట్), చైల్డ్ లైన్, లేబర్ విభాగాలు సంయుక్తంగా కల్పి తొమ్మిది బృందాలుగా ఏర్పడి వివిధ పరిశ్రమలు, ఇటుక తయారీ పరిశ్రమ, కంకర క్రషర్స్, షాపింగ్ మాల్స్, వ్యాపార సముదాయాలు, హోటళ్ళలో ఆకస్మిక తనీఖీలు నిర్వహించినట్లు వివరించారు. ఈ తనీఖీల్లో 18 సంవత్సరాలలోపు వున్న 147 మంది బాల కార్మికులకు పనుల నుంచి విముక్తి కలిగించినట్లు తెలిపారు.

ఇందులో 117 మంది బాలురు, 30 మంది బాలికలు వున్నట్లు పేర్కొన్నారు. విముక్తి కలిగించిన బాలకార్మికుల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు 56మంది కాగా మిగిలిన  91 మంది దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చిన్నారులుగా గుర్తించామన్నారు. తనీఖీల్లో గుర్తించబడిన చిన్నారులను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరు పరిచి చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించామన్నారు. అలాగే చిన్నారులతో పనులు చేయించుకుంటున్న వ్యాపారస్థులపై 12 కేసులను నమోదు చేసామన్నారు. ఈ తనీఖీల్లో రెండు సంవత్సరాల క్రితం పర్కాల పోలీస్ స్టేషన్ పరిధిలో తప్పిపోయిన బాలుడిని వారి తల్లిదండ్రులకు అప్పగించామన్నారు. 18లోపు చిన్నారులతో పనులు చేయించుకోవడం చట్టరీత్యా నేరమని, ఎవరైన చిన్నారులతో పనులు చేయించుకుంటున్నట్లుగా సమచారం అందింతే డయల్ 100 గానీ చైల్డ్ లైన్ నంబర్ 1098 నంబర్ సమాచారాన్ని అందించాల్సిందిగా పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు.