కాంగ్రెస్ వస్తే మళ్ళీ కరెంటు కష్టాలే

కాంగ్రెస్ వస్తే మళ్ళీ కరెంటు కష్టాలే
  • మహిళలకు సౌభాగ్య లక్ష్మి
  • మరోసారి దీవించండి
  • బిఆర్ఎస్ అభ్యర్థి పద్మ దేవేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్:కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ కరెంటు కష్టాలు తప్పవని బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చాక మహిళల నీటి కష్టాలు లేకుండా చేసినట్లు సోభాగ్య లక్ష్మి పథకం ద్వారా 3 వేలు, 400 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నట్లు తెలిపారు. శుక్రవారం పాపన్నపేట మండల పరిధిలోని ఎల్లాపూర్, పొడిచన్ పల్లి, శానాయిపల్లి, తుమ్మలపల్లి, నాగ్సానిపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఆడపడుచులతో బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన మైనంపల్లి హనుమంతరావుకే మన మెదక్ గురించి సరిగ్గా తెలువదు, ఇంకా ఆయన కొడుకు కొత్తగా వచ్చి  తెలుసుకునేలోపే ఐదేళ్ల కాలం గడిచిపోతుందన్నారు. అధికారంలో కేసీఆర్ ఉంటేనే కరెంటు పుష్కలంగా ఉంటుందని, లేకుంటే గోస పడటం ఖాయమన్నారు.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఏళ్ల తరబడి గోస పడింది మర్చిపోవద్దన్నారు. నాడు రాష్ట్రంలో నీళ్లు, కరెంటు సరిగ్గా ఉన్నాయా అని గుర్తు చేశారు. అవన్నీ యాది ఉంచుకొని ఓటు వేయాలన్నారు. కేసీఆర్ వచ్చాక 24 గంటల కరెంటు, పండిన ప్రతి ధాన్యం గింజ కొంటున్నాం కాబట్టే ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారన్నారు. పెట్టుబడి సాయంతో కేసీఆర్ ఆదుకుంటున్నారన్నారు. కర్ణాటకలో కాంగ్రెసును గెలిపిస్తే కరెంట్ ను ఖతం చేశారన్నారు. ఆలోచన చేసి ఓటు వేయకుంటే మన వేలితో మన కన్నునే పొడిపించడంలో రేవంత్ రెడ్డి, మైనంపల్లి మొదటి స్థానంలో ఉంటారన్నారు. మిషన్ భగీరథతో ఇంటి ఇంటికి నీరు అందిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో కూడా లేవని పేర్కొన్నారు. ఆసరా పింఛన్లు సైతం రూ.5 వేలు అందించనున్నామని, అసైన్డ్ భూములకు పూర్తి హక్కులు ఇవ్వనున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలని, మోసపోతే గోస పడతామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏ పని చేసిన బడుగు బలహీనవర్గాల కోసమే చేస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సోములు, పార్టీమండల అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు గడీల శ్రీనివాస్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు జగన్నాథం, ఏడుపాయల పాలకమండలి చైర్మన్ బాలాగౌడ్, మాజీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.