మూడు రకాల చెత్త లను ప్రజల నుంచి సేకరించిన ఏకైక మున్సిపాలిటీ సిద్దిపేట

మూడు రకాల చెత్త లను ప్రజల నుంచి సేకరించిన ఏకైక మున్సిపాలిటీ సిద్దిపేట
  • దేశపటంలో సిద్దిపేటకు ప్రత్యేక గుర్తింపు
  • ఇతర రాష్ట్రాల వారే సిద్దిపేట అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతున్నారు
  • పట్టణ ప్రగతి సభలో మంత్రి హరీష్ రావు

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట: మునిసిపాలిటీ ద్వారా చేపట్టిన అనేక ప్రత్యేక కార్యక్రమాలతో దేశ చిత్రపటంలోనే సిద్దిపేటకు ప్రత్యేక గుర్తింపు రానున్నదని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చెప్పారు శుక్రవారం రాత్రి సిద్దిపేటలోని కొండ మల్లయ్య గార్డెన్ లో జరిగిన పట్టణ ప్రగతి సభలో మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ సిద్దిపేట పురపాలక సంఘ పట్టణ ప్రగతి నివేదికను చదివి వినిపించారు. పట్టణ ప్రగతి బ్రోచర్లను మంత్రి హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు తదితరులు ఆవిష్కరించారు సభలో మంత్రి మాట్లాడుతూ సిద్దిపేటలో తడి చెత్త పొడి చెత్త హానికర చెత్తలను మూడు విధాలుగా ప్రజల నుంచి సేకరించి తీసుకుపోవడంతో దేశంలోనే మొదటి మున్సిపాలిటీగా గుర్తింపు సాధించింది అన్నారు.

చెత్త నుంచి కూడా ఆదాయాన్ని సంపాదిస్తున్న మున్సిపాలిటీ సిద్దిపేట అని ఆయన కొనియాడారు పట్టణ ప్రగతి అవార్డులలో సిద్ధిపేటకు ప్రథమ స్థానం వచ్చినందున మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల హైదరాబాద్ సభకు వెళ్లిన ఇక్కడి నుంచి ఆమెకు మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు సిద్దిపేటలో కాలుష్య నివారణకు రెండవ రింగ్ రోడ్డును మంజూరు చేయించారని చెప్పారు. 

వైకుంఠ దామలఏర్పాటు,చెట్ల పెంపకము, చెరువుల సుందరీ కరణ, పార్కులో ఏర్పాటు, రోడ్ల అభివృద్ధి, భూగర్భ డ్రైనేజీ పథకాలు పట్టణ పరిధిలో మైలురాళ్ళని చెప్పారు. సిద్దిపేట ప్రగతిని ఇతర రాష్ట్రాల మున్సిపల్ పాలకవర్గాలు చూసి వెళ్తూ అభినందిస్తున్నాయన్నారు. పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సిద్దిపేట అభివృద్ధిలో మున్సిపల్ కార్మికుల పాత్ర మంత్రి పాత్రను కొనియాడారు. పాలకవర్గ సహాయ సహకారాలు వల్లే పట్టణ ప్రగతి సాధ్యమైందని చెప్పారు.వచ్చే ఎన్నికల్లో లక్షన్నర మెజారిటీతో మళ్లీ మంత్రిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.సభలో ఉత్తమ సపాయి కార్మికులకు, మున్సిపల్ సిబ్బందికి, స్వచ్ఛ సిబ్బందికి, కౌన్సిలర్లకు మంత్రి చేతుల మీదుగా మెమొంటోలు, బహుకరించి ప్రశంసా పత్రాలను అందజేశారు. సభలో 43 వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముందుగా చెత్త తరలించే వాహనాలను అందంగా అలంకరించి సిద్దిపేట ప్రధాన వీధుల గుండా మున్సిపల్ సిబ్బంది వాహనాల ర్యాలీ నిర్వహించారు.