సింగరేణిలో సికాస పునర్నిర్మాణం కు  వ్యూహం..?

సింగరేణిలో సికాస పునర్నిర్మాణం కు  వ్యూహం..?
  • ఆదిలోనే భగ్నం చేసిన రామగుండం కమిషనరేట్ పోలీసులు..
  • గుర్తింపు ఎన్నికలు సమీపిస్తున్న వేళ... మళ్లీ తెరపైకి సికాస కార్యకలాపాలు..!
  • కార్మిక సంఘాలు, కాంట్రాక్టర్లలో  మొదలైన గుబులు...

ముద్ర, పెద్దపల్లి ప్రతినిధి:-సింగరేణిలో కనుమరుగైన నిషిద్ధ మావోయిస్టు పార్టీ అనుబంధ సింగరేణి కార్మిక సమాఖ్య చాలా కాలం తర్వాత మళ్లీ పునర్నిర్మాణానికి వ్యూహరచన చేస్తుందా...? ఆ బాధ్యతలను మావోయిస్టు పార్టీ ఇతర రాష్ట్రాలకు చెందిన సమర్థులైన క్యాడర్ కు అప్పగించిందా...? అంటే అవుననే చెప్పవచ్చు. ఇందుకు ఇటీవల పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో సికాస పునర్నిర్మాణం కోసం మావోయిస్టు పార్టీ నక్సలైట్ వచ్చి, అనుకోకుండా పోలీసులకు చిక్కిన సంఘటన బట్టి...  సింగరేణిలో  మళ్లీ సికాస పునర్నిర్మాణంకు మావోయిస్టు పార్టీ వ్యూహరచన  చేస్తుందన్న  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాడు సింగరేణి సంస్థలో యాజమాన్యం ఆధిపత్యం, కార్మిక సంఘాల నాయకుల అక్రమాలు, కాంట్రాక్టర్ల శ్రమ దోపిడీ ని అరికట్టి కార్మికులకు మెరుగైన వసతులు, వేతనాలు కల్పించాలని ఉద్దేశంతో  1980 సంవత్సరంలో అదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి లో సింగరేణి కార్మిక సమాఖ్య ( సికాస) పేరుతో విప్లవ సంఘం ఆవిర్భావించింది. 1981 సంవత్సరంలో సింగరేణి వ్యాప్తంగా 56 రోజుల సుదీర్ఘ సమ్మెకు సికాస నాయకత్వం వహించింది. సికాస వ్యవస్థాపక అధ్యక్షుడు హుస్సేన్  సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాలలో కమిటీలను కూడా నియమించుకుంది.

1982 సంవత్సరం జూన్ 11వ తేదీన గోదావరిఖనిలో మొట్టమొదటిసారిగా సికాస సదస్సు నిర్వహించింది.  900 మంది ప్రతినిధులు హాజరైన ఆ సదస్సు ను అడ్డుకునేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేసి సికాస ను నిషేధించారు. దాంతో అప్పుటి నిషిద్ధ  పీపుల్స్ వార్ పార్టీతో అనుసంధానంగా ముడి పెట్టుకుని  సాయుధ దళాలను ఏర్పాటు చేసుకుంది. 1988, 1992 మధ్యలో సింగరేణిలో సికాస కార్యకలాపాలు స్తంభించిపోయాయి.  పోలీసుల అణచివేత  తీవ్రతరం కావడంతో అప్పుడు సింగరేణిలో పూర్తిగా క్షీణించిపోయింది. 1992 సంవత్సరంలో సికాసను పూర్తిగా నిషేధింపబడింది. అనేపద్యంలో 2000 సంవత్సరంలో అదిలాబాద్ జిల్లాలో  పోలీసులతో జరిగిన కాల్పుల్లో ఇద్దరు సికాస నాయకులు నెలకొరి గారు. 2004 సంవత్సరంలో సింగరేణిలో మళ్లీ సికాస  పునరుద్ధరణ చర్యలకు శ్రీకారం చుట్టగా... 2006 సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సికాస పై ఉన్న నిషేధాన్ని పొడగిస్తూ వస్తుంది.

సింగరేణి కార్మికోద్యమంలో  తమదైన ముద్ర వేసుకున్న సికాస ముఖ్య నాయకులు  మాదిరెడ్డి సమ్మిరెడ్డి అలియాస్ రమాకాంత్ ఎన్ కౌంటర్ తో సికాస కార్యకలాపాలు  మరింతగా క్షీణించాయి. అప్పటినుంచి ఇప్పటివరకు మావోయిస్టు పార్టీ అనుబంధ  సికాస కోల్ బెల్టు కార్యదర్శి జంజిపల్లి శ్రీధర్ పేరుతో సింగరేణి వ్యాప్తంగా హెచ్చరిక ప్రకటనలు వెలువడుతూ వస్తున్నాయి. ఈ దరిమిలా మావోయిస్టు పార్టీ అగ్ర నాయకత్వం  కోల్ బెల్టు లో మళ్లీ సికాస కు పునరుజీవం పోసేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మావోయిస్టు పార్టీ నక్సలైట్ ను కోల్బెల్టు ప్రాంతానికి పంపించినట్లు తెలుస్తోంది. అయితే పక్షం రోజుల కింద మంచిర్యాల జిల్లా ఇందారంలో ఒక రహస్య ప్రాంతంలో ఉన్న ఇద్దరు మావోయిస్టు నక్సలైట్లను  అత్యంత చాకచక్యంగా రామగుండం కమిషనరేట్ పోలీసులు పట్టుకొని అరెస్టు చేశారు. తాజాగా గోదావరిఖని జిఎం ఆఫీస్ సమీపంలో మరో మావోయిస్టు నక్సలైట్ ను కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేయగా, సింగరేణిలో సికాస  పునర్నిర్మాణం కోసమే  తనను మావోయిస్టు పార్టీ నాయకత్వం పంపించిందని చెప్పడం కోల్బెల్టు ప్రాంతంలో మళ్లీ సికాస అలజడి మొదలైనట్లు తెలుస్తోంది. ఈనెల 27వ తేదీన సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఉండడంతో కార్మిక సంఘాల నాయకులు, ఓపెన్ కాస్ట్  ఓబి కాంట్రాక్టర్లు సికాస కార్యకలాపాల పట్ల ఆందోళన చెందుతున్నారు.