ధరణి కేడీలకు బేడీలే

ధరణి కేడీలకు బేడీలే
  • కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి రద్దు
  • భూమి పేదవాడి ఆత్మగౌరవం
  • ధరణితో వేల కోట్లు సంపాదించిన కేసీఆర్ బంధువులు
  • రైతులకు హామీ కార్డు అందజేసిన జై రామ్ రమేష్

ముద్ర ప్రతినిధి కరీంనగర్: ధరణి పోర్టల్ తో వేలకోట్ల సంపాదిస్తున్న కేడీలకు బేడీలు వేయాలని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం పెద్దపెల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్ పూర్ గ్రామంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధరణి పోర్టల్ సమస్యలపై కాంగ్రెస్ పార్టీ సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది.  ధరణితో ఇబ్బందులు పడుతున్న రైతులకు, ఇతర భూ యజమానులకు 'కాంగ్రెస్ హామీ కార్డు' అందజేశారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ కార్యదర్శి జయరాం రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ధరణి పోర్టల్ తో ఇబ్బంది పడుతున్న రైతులకు ఆయన చేతుల మీదుగా కాంగ్రెస్ హామీ కార్డును అందజేశారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో జరిగిన అనేక పోరాటాలకు మూలం భూమి అన్నారు.  

పేదవాడి ఆత్మగౌరవం, జీవనవిధానం భూమిపైనే ఆధారపడి ఉన్నాయని వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలో సరళీకృత విధానాలు తెచ్చి పేదలకు పంపిణీ చేసింది. 2006లో అటవీ హక్కుల చట్టం తెచ్చి ఆదివాసీ, గిరిజనులకు 10లక్షల ఎకరాలు పంపిణీ చేసిన చరిత్ర కాంగ్రెస్ దని స్పష్టం చేశారు. 2013 భూసేకరణ చట్టం తెచ్చి పేదలను ఆదుకుంది కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. చట్టాల రూపకల్పన చేసిన ఘనత ఏఐసీసీ కార్యదర్శి జైరాం రమేశ్ కు దక్కుతుందన్నారు. కేసీఆర్, మోదీ కలిసి భూసేకరణ చట్టానికి తూట్లు పొడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధరణితో పల్లెలు చిద్రం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధనవంతుల కోసమే కేసీఆర్ ధరణి పోర్టల్ తీసుకొచ్చారని మండిపడ్డారు. ధరణితో పేదల నుంచి వేలాది కోట్లు దోచుకుంటున్నారు. ధరణితో కేసీఆర్ బంధువులు వేల కోట్లు దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో పేదలకు భూములు పంచి వారి ఆత్మగౌరవం నిలబెట్టాం. ఇప్పుడు వారి భూములను వారికి అందేలా చేసి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేది కూడా కాంగ్రెస్ పార్టీనే అని వెల్లడించారు. రాష్ట్రంలో 9 లక్షల మంది ధరణితో సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 100 రోజుల్లో ధరణి సమస్యలను పరిష్కరిస్తాం అన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ ధరణి విధానంలో లోపాలను సరి చేసి పేదలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బరాబర్ ధరణి పోర్టల్ రద్దు చేస్తాం అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ తెలంగాణా రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, సీనియర్ నేత కొప్పుల రాజు,   సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య మహేశ్ కుమార్ గౌడ్, ఇతర నేతలు హాజరయ్యారు.